షాద్ నగర్, వెలుగు: నీ తండ్రి కేసీఆర్ ఓ పాస్ పోర్ట్ బ్రోకర్.. చెల్లి కవిత అక్రమాలు చేసి తీహార్ జైల్లో చిప్పకూడు తింటుంది. నువ్వేమో ఫామ్ హౌజ్‌లు, క్లబ్బులు, పబ్బుల్లో చిందులు వేస్తున్నావ్.. దేశం కోసం పెరంబుదూర్‌లో ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు రాజీవ్ గాంధీ విగ్రహాలను నువ్వా తొలగించేది? అంటూ కేటీఆర్ పై షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం షాద్ నగర్ పట్టణంలో రాజీవ్ గాంధీ జయంతిని నిర్వహించారు. రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు తొలగించి రాష్ట్ర నాయకుడి పేరు పెడతామన్న కేటీఆర్ కు బుద్ధి లేదన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం అసువులు బాసిందని పేర్కొన్నారు. అలాంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ సెక్రటేరియట్ ముందు పెట్టనివ్వమని చెప్పడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. సాంకేతిక విప్లవాన్ని తీసుకువచ్చి దేశం అభివృద్ధిలో రాజీవ్ గాంధీ కీలకపాత్ర పోషించారనే విషయాన్ని కేటీఆర్ మరవకూడదన్నారు.