వెలమ దొరల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది :ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్​

  • తెలంగాణలో వాళ్లను లేకుండ చేయాలె: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్​
  • సీఎం రేవంత్ కు తెలియకుండా వెలమల పనిపడతామని కామెంట్లు

బషీర్ బాగ్/షాద్ నగర్, వెలుగు: గడచిన పది ఏండ్లలో వెలమ దొరల పాలనలో రాష్ట్రం మొత్తం దివాళా తీసిందని.. తెలంగాణలో వెలమలను లేకుండా చేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రాష్ట్రంలో ఇక మీదట వెలమల ఆటలు సాగవని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా శుక్రవారం వీర్లపల్లి శంకర్ ఓ యూట్యూబ్ చానెల్ లో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండా వెలమ దొరల పని పడతామని అన్నారు.

శంకర్​ క్షమాపణ చెప్పాలి: వెలమలు

వెలమ సామాజిక వర్గాన్ని అసభ్య పదజాలంతో దూషించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆయన ఇంటిని ముట్టడిస్తామని ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు నీలగిరి దివాకర్ రావు హెచ్చరించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్​లోని వెలమ అసోసియేషన్ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శంకర్​పై దోమలగూడ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమ కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆయన వెంట చెప్యాల హరీశ్ రావు, కోట్ల నరేందర్ రావు, వుజ్జిని కిషన్ రావు, పడకంటి శర్మిల తదిరతరులు ఉన్నారు.