INDW vs SAW: షెఫాలీ, స్మృతి సెంచరీలు.. 500 పరుగుల దిశగా టీమిండియా

INDW vs SAW: షెఫాలీ, స్మృతి సెంచరీలు.. 500 పరుగుల దిశగా టీమిండియా

దక్షిణాఫ్రికాపై జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు దుమ్ము రేపుతోంది. మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన కౌర్ బృందం టెస్టులోనూ ఆ జోరు కొనసాగిస్తోంది. చెన్నై చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలి రోజే భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. మొదట బ్యాటింగ్ చేస్తున్న మన మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్ లో వికెట్ కోల్పోకుండా 243 పరుగులు చేయడం విశేషం. ఓపెనర్లు షెఫాలీ వర్మ(119), స్మృతి మందాన(122) అజేయ సెంచరీలతో బ్యాటింగ్ చేస్తున్నారు.

ఓపెనర్ల దూకుడు:

మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్ కు ఓపెనర్లు షెఫాలీ, స్మృతి మందాన సఫారీ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన ఈ జోడీ పోటా పోటీగా బ్యాటింగ్ చేశారు. బౌండరీల వరద పారిస్తూ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశారు. 5 కు పైగా రన్ రేట్ తో అలవోకగా బౌండరీలు బాదేశారు. ఈ జోడీని విడదీయడానికి ఎంతమంది సఫారీ బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. వికెట్ తీయకపోగా సఫారీ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడం విశేషం. 

Also Read:క్యాన్సర్‌తో పోరాడుతున్నా.. స్టేజ్ త్రీ: హీనా ఖాన్

తొలి సెషన్ లో వేగంగా పరుగులు చేసిన ఈ ఓపెనింగ్ ద్వయం.. రెండో సెషన్ లో మరింతల రెచ్చిపోయారు. ఈ క్రమంలో షెఫాలీ 113 బంతుల్లో తన టెస్ట్ కెరీర్ లో తొలి సెంచరీని నమోదు చేసింది. మరోవైపు స్మృతి మందాన 122 బంతుల్లో తన టెస్ట్ కెరీర్ లో రెండో సెంచరీని పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ లో చివరి 5 మ్యాచ్ ల్లో మందానకు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. భారత ఓపెనర్ల జోరు చూస్తుంటే టీమిండియా 500 మార్క్ అలవోకగా టచ్ చేసేలా కనిపిస్తుంది.