టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్.. ఒకరు క్రికెట్ లో కింగ్ అయితే.. మరొకరు సినిమాల్లో సూపర్ స్టార్. ఆయా రంగాల్లో వీరిద్దరికీ ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవరసం లేదు. ఒకరు ఆటతో అభిమానులను సంపాదించుకుంటే మరొకరు తన నటనతో అందరిని మెప్పించాడు. అయితే వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. 2008లో కోల్ కతా నైట్ రైడర్స్ ఓనర్ గా షారుఖ్ ఉన్న సంగతి తెలిసిందే. అప్పుడు కేకేఆర్ కెప్టెన్ గా గంగూలీ ఉండడం విశేషం. దీంతో వీరిద్దరి మధ్య మంచి ఇప్పటికీ మంచి సఖ్యత ఉంది.
ఐపీఎల్ లో భాగంగా వీరిద్దరూ గ్రౌండ్ లో మాట్లాడుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నిన్న (ఏప్రిల్ 29) ఢిల్లీపై కేకేఆర్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ సహ-యజమాని షారుఖ్ ఖాన్.. సౌరవ్ గంగూలీని వెనక నుంచి కౌగిలించుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూమెంట్ మొత్తం మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. ఇద్దరూ చాలా సేపు మైదానంలో సరదాగా మాట్లాడుకున్నారు. ప్రస్తుతం గంగూలీ ఢిల్లీ జట్టుకు మెంటార్ గా ఉంటున్నాడు. మరోవైపు షారుఖ్ ఇప్పటికీ కేకేఆర్ కో ఓనర్ గా కొనసాగుతున్నాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. సోమవారం(ఏప్రిల్ 29) ఈడెన్ వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట ఢిల్లీ 153 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని కోల్‌కతా ఓపెనర్ ఫిల్ సాల్ట్(68; 33 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఉఫ్ మని ఊదేశాడు. క్యాపిటల్స్ బౌలర్లను చీల్చి చెండాడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. అతని ధాటికి కోల్‌కతా మరో 21 బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని చేధించింది.