
ఛాంపియన్స్ ట్రోఫీలో హైబ్రిడ్ మోడల్ కారణంగా భారత జట్టు అన్ని మ్యాచ్ లను దుబాయ్ లోనే ఆడాల్సి వచ్చింది. మరోవైపు మిగిలిన జట్లు మాత్రం పాకిస్థాన్ నుంచి దుబాయ్ కు తిరగాల్సి వచ్చింది. దుబాయ్ పరిస్థితులకు త్వరగా అలవాటు పడిన టీమిండియా టోర్నీలో ఒక్క ఓటమి లేకుండా టైటిల్ గెలిచింది. వరుస విజయాలు సాధిస్తూ మ్యాచ్ లన్నీ ఏకపక్షంగా మార్చేశాయి. సమిష్టిగా ఆడుతూ ప్రతి ఒక్కరూ భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. జట్టులో ప్రతి ఒక్కరు కూడా టాప్ ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియాను ఓడించడం ఏ జట్టుకైనా సవాలే.
భారత జట్టు ప్రస్తుతం ఉన్న ఫామ్ గురించి పాకిస్థాన్ మాజీ బ్యాటర్ షాహిద్ అఫ్రిది ప్రశంసల వర్షం కురిపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకు జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. అఫ్రిది భారత క్రికెట్ జట్టుకు ఇచ్చిన ఒక ప్రశంస సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. సమా టీవీలో మాట్లాడుతూ.. "ఈ టోర్నీ గెలవడానికి భారత జట్టు అర్హులు. వారు తమ అన్ని మ్యాచ్‌లను ఒకే చోట ఆడారు. వేదికను మార్చలేదు కాబట్టి వారికి పరిస్థితులు తెలుసని నేను అంగీకరిస్తున్నాను. టీమ్ సెలక్షన్ అద్భుతంగా ఉంది. నేను దుబాయ్ లో చాలా మ్యాచ్ లను ఆడాను. ఇక్కడ మేము మ్యాచ్ లు ఆడేటప్పుడు స్పిన్నర్లను ఎటాకింగ్ చేసేవాళ్ళం.
దుబాయ్ లో స్పిన్నర్ల కీలక పాత్ర పోషిస్తారు. జట్టు ఎంపిక చాలా బాగుంది. ఒకసారి భారత జట్టును చూసినట్లయితే ఓపెనర్ల నుండి మిడిల్ ఆర్డర్ వరకు అద్భుతంగా ఉంది. ఆల్ రౌండర్లు, గొప్ప స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్ల ఇలా ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లే. దుబాయ్ లో ఇండియాపై ప్రపంచ క్రికెట్ మొత్తం ఒక జట్టుగా ఏర్పడినా విజయం సాధించలేదు. టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ముందుకు సాగిన ఏకైక జట్టు భారత్. అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోయినా.. ఈ ఫార్మాట్‌లో ఫామ్‌లో ఉన్న మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేయకపోయినా.. నలుగురు స్పిన్నర్లకు మద్దతు ఇచ్చిన కూడా భారత్ టైటిల్ గెలిచింది". అని అఫ్రిది అన్నాడు.