అతి విశ్వాసం దెబ్బకొడుతుంది.. భారత ఓటమికి ముందే శాపనార్థాలు పెట్టిన అఫ్రిది

అతి విశ్వాసం దెబ్బకొడుతుంది.. భారత ఓటమికి ముందే శాపనార్థాలు పెట్టిన అఫ్రిది

టోర్నీ అసాంతం వరుస విజ‌యాల‌తో అద్భుతంగా రాణించిన భారత జట్టు ఆఖ‌రి మెట్టుపై బోల్తా ప‌డిన విషయం తెలిసిందే. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైన‌ల్ పోరులో టీమిండియా.. ఆసీస్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో భారత క్రికెటర్లు, అభిమానులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. మ్యాచ్ ముగిసి 12 గంటలు కావొస్తున్నా ఎవరి ముఖాల్లోనూ కాసింతైనా సంతోషం కనిపించడం లేదు. ఇలాంటి సమయాన దాయాది జట్టు పాకిస్తాన్ క్రికెటర్ల మాటలు మరింత బాధ పెడుతున్నాయి.    

వరల్డ్ కప్ ఫైనల్ పోరులో ఆసీస్ చేతిలో భంగపోయిన భారత జట్టును పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ షాహీద్ ఆఫ్రిదీ వ్యాఖ్యలు మరింత బాధ కలిగిస్తున్నాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసం భారత్‌ను దెబ్బకొడుతుందని ఓటమికి ముందే అఫ్రిది ఓ ఛానెల్‌లో మాట్లాడాడు. ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్‌కు చెందిన సమా టీవీలో లైవ్ షోలో పాల్గొన్న అతడు.. శ్రేయాస్ అయ్యర్‌ వికెట్ పడగానే ఈ  వ్యాఖ్యలు చేశాడు. 

"అంతర్జాతీయ క్రికెట్ అంటే ఒత్తిడిని ఎదుర్కోవడమే. భారత ఆటగాళ్లపై అలాంటిది ఏమీ లేదు ఎందుకంటే వారు సొంత అభిమానుల మధ్య ఆడుతున్నారు. వారు ఆత్మవిశ్వాసంతో కూడిన ఆటగాళ్లు. ఈ విషయం వారికీ తెలుసు. కాకపోతే వరుస విజయాలు సాధిస్తున్నప్పుడు.. మితిమీరిన అతి విశ్వాసాన్ని కలిగి ఉంటారు.. అది వారిని చంపుతుంది..("జబ్ ఆప్ కంటిన్యూలీ జీతే జాతే హో, తో ఆప్ ఓవర్ కాన్ఫిడెంట్ భీ హో జాతే హై, వో ఆప్కో మార్వా దేతీ హై"). 

"శుబ్‌మాన్ గిల్‌కి ఇది పెద్ద అవకాశం.. అతను దాన్ని సద్వినియోగం చేసుకోలేదు.. తప్పుడు షాట్ ఆడాడు.. ఎందుకంటే అది ఔటయ్యే డెలివరీ కానే కాదు.. పెద్ద మ్యాచ్ లలో స్టేడియం కిక్కిరిసి ఉంటుంది. అలాంటి సమయాల్లో మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్న బిగ్ మ్యాచ్ ప్లేయర్లను మీరే చూస్తారు.." అని అఫ్రిది వ్యాఖ్యానించాడు. అతని శాపనార్థాలు దెబ్బో ఏమో కానీ మన జట్టు నిజంగానే ఓటమి పాలైంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.