ఏరోజు పనికెళ్తే ఆ రోజే కడుపునిండా తినేది. చిన్నప్పటి నుంచి అమ్మతో కలిసి పనికెళ్లడం తప్ప, బడికి వెళ్లడం తెలియదామెకి. చదువంటే ఏంటో, ఎందుకు చదువుకోవాలో కూడా చెప్పేవాళ్లు లేని ఫ్యామిలీలో పుట్టింది ఆ అమ్మాయి. ఈ విషయం తెలిసిన ఒక టీచర్ ఆమెని బడికి పంపమని వాళ్లమ్మకి నచ్చజెప్పింది. అమ్మ సరేనంది. కానీ.. ‘ఆడపిల్లకి చదువెందుకు?’ అంది వాళ్ల సొసైటీ. ఎదిరించి చదివించినందుకు ఫైన్ కూడా వేసింది. అయినా వెనకాడని ఆ కుటుంబం, తమ కూతురికి మంచి భవిష్యత్ ఇవ్వాలనుకుంది. అన్ని విధాలా తోడు ఉండి, ముందుకు నడిపించింది వాళ్లమ్మ. దాని ఫలితం... చిన్న వయసు లోనే ‘నేషనల్ మైనారిటీ కమిషన్’ మెంబర్ అయింది ఆదిలాబాద్‌కు చెందిన షహజాది సయ్యద్. ఆమె జర్నీ గురించి తన మాటల్లోనే..
‘‘చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్లకుండా అమ్మతో కలిసి పనికి వెళ్లేదాన్ని. అప్పటి వరకు పని తప్ప, బడి తెలియదు. నాకొక అక్క, అన్న కూడా ఉన్నారు. అన్న బడికి వెళ్లి చదువుకునేవాడు. నేను, అక్క అమ్మతో కలిసి పనికి వెళ్లేవాళ్లం. హమాలీ వాడలో చైల్డ్ లేబర్ స్కూల్ ఉంది. మా అమ్మతో ‘ఆ స్కూల్లో కుట్లు, అల్లికలు నేర్పిస్తారు. మధ్యాహ్నం భోజనం పెడతారు. బాగా చదువుకుంటేనే కష్టాలు దూరమవుతాయి’ అని ఆ స్కూల్లో పనిచేసే ఒక టీచర్ మా అమ్మకు అర్థమయ్యేలా చెప్పింది. అందుకే ఎంత కష్టమైనా రోజూ నాలుగు కిలోమీటర్లు నడిచి బడికి వెళ్లేదాన్ని. అక్కడ మూడేండ్లు చదివా. తర్వాత ఒక ఎగ్జామ్ పెట్టారు. అందులో నేను ఫస్ట్ వచ్చాను. దాంతో నాకు ఆదిలాబాద్ గవర్నమెంట్ హైస్కూల్లో అడ్మిషన్ దొరికింది. ఏడు నుంచి పదో తరగతి వరకు అక్కడే చదివా. మా వంశంలోనే అమ్మాయిల్లో చదువుకున్నది నేనొక్కదాన్నే. ‘‘స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం కోడిగుడ్డు పెట్టట్లేద’’ని మంత్రి సమావేశం జరుగుతున్నప్పుడు డైరెక్ట్‌గా కలెక్టర్‌కి కంప్లైంట్ ఇచ్చా. అప్పుడు స్కూల్ నుంచి బయటికి పంపిస్తానని ప్రిన్సిపల్ నా మీద అరిచారు. చాలామంది భయపెట్టారు. కానీ, నేనైతే భయపడలేదు.’’
ఆడపిల్లల్ని చదివిస్తే ఫైన్
మావాళ్లలో ఒక కమిటీ ఉండేది. ‘ఆడవాళ్లు బయటికి వెళ్లొద్దు. చదవొద్దు’ అని రూల్స్ పెట్టేది ఆ కమిటీ. ఆ రూల్స్ ఎవరైనా బ్రేక్ చేస్తే ఫైన్లు వేసేది. వాళ్ల మాట వినకుండా నన్ను స్కూల్‌కి పంపేది మా అమ్మ. దాంతో అందరూ కూర్చొని మీటింగ్ పెట్టి నన్ను చదివించొద్దని మా అమ్మానాన్నలకు గట్టిగా చెప్పారు. ఎంత చెప్పినా మా వాళ్లు వినకపోయేసరికి గొడవలు కూడా జరిగాయి. ఎన్ని జరిగినా సరే నా చదువు విషయంలో మా పేరెంట్స్ వెనక్కి తగ్గలేదు. మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. నాన్న ఇంటి అవసరాలు చూసుకునేవాడు. అమ్మ పనికి వెళ్లి సంపాదించిన డబ్బులతో కమిటీ వేసే ఫైన్లు కట్టేది. అలా నా చదువు అతి కష్టం మీద సాగింది. ఇంట్లో అందరికన్నా మా అమ్మ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఎక్కువ. ప్రతి విషయంలో నాకు తోడుండి, నన్ను సపోర్ట్ చేసింది. ఆమె తర్వాతే మిగతా వాళ్లంతా సపోర్ట్‌గా నిలిచారు.
ప్రైజ్ మనీతో సైకిల్ కొనుక్కున్నా
టెన్త్ క్లాస్‌లో ‘ఉగ్రవాదం నిషేధించడమెలా?’ అనే అంశంపై ఒక ఎగ్జామ్ పెట్టారు. అందులో నేను జిల్లా ఫస్ట్ వచ్చాను. అప్పుడు నాకు రెండు వేల రూపాయలు ప్రైజ్ మనీ ఇచ్చారు. దాంతో సైకిల్ కొనుక్కున్నా. అప్పటివరకు స్కూల్‌కి నడిచి వెళ్లేదాన్ని. సైకిల్ కొనుక్కున్న తర్వాత డిగ్రీ వరకు దాని మీదే వెళ్లి చదువుకున్నా.
ఆర్మీకి వెళ్లాలనుకున్నా
నాకు చిన్నప్పటి నుంచి ఆర్మీలో చేరాలని కోరిక. ఎనిమిదో క్లాస్‌లో ఉన్నప్పుడు పీఈటీ టీచర్ జ్యోతి నన్ను స్పోర్ట్స్‌లో బాగా ఎంకరేజ్ చేసింది. ఆర్థికంగా కూడా నాకు సాయం చేసిందామె. అప్పుడు సాఫ్ట్ బాల్ ఎక్కువ ఆడేదాన్ని. అందులో నేషనల్ లెవల్ వరకు వెళ్లాను. ఇండియాలోనే థర్డ్ ప్లేస్, బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చా. ఆర్మీ కోసమే స్పోర్ట్స్ ఆడాను.
ఎన్.సి.సి.లో కూడా చేరా. అయితే... అప్పుడప్పుడు స్కూల్లో జరిగే కాంపిటీషన్స్‌లో గెలిస్తే వివేకానంద బుక్స్ ఇచ్చేవాళ్లు. అవి చదివి వాటి ప్రభావం వల్ల ఆదిలాబాద్ ఏబీవీపీలో జాయిన్ అయ్యా. అక్కడ అబ్దుల్ కలాం, అంబేద్కర్ పుస్తకాలు చదివా. వాళ్ల ప్రభావంతో ఉద్యమాల్లో కూడా పార్టిసిపేట్ చేశా.
పాలిటిక్స్ వైపు..
ఉమెన్స్ డిగ్రీ కాలేజ్‌లో బి.ఏ., ఉస్మానియా యూనివ ర్సిటీలో పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేశా. స్పెషల్ ఇంట్రెస్ట్‌తో ఎం.ఏ. హిందీ కూడా చేశా. చదువు పూర్తయ్యాక 2018లో ఎమ్మెల్యేగా చాంద్రాయణ గుట్ట నుంచి పోటీ చేశా. పోయిన ఏడాది డిసెంబరు18న జాతీయ మైనారిటీ కమిషన్ మెంబర్‌గా అపాయింట్ చేస్తున్నట్టు సెంట్రల్ మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి నుంచి పిలుపు వచ్చింది. కమిషన్‌లో ఉన్న ఆరుగురిలో నేనొకదాన్ని. అందుకు చాలా సంతోషంగా ఉంది. మైనారిటీలు, ముఖ్యంగా అమ్మాయిల హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడతా’’.
– మనీష పరిమి