ధోనీ సలహా పని చేసింది.. అందుకే సెంచరీతో మ్యాచ్ గెలిపించా: విండీస్ కెప్టెన్

ధోనీ సలహా పని చేసింది.. అందుకే సెంచరీతో మ్యాచ్ గెలిపించా: విండీస్ కెప్టెన్

వెస్టిండీస్ వన్డే కెప్టెన్, స్టార్ బ్యాటర్ షై హోప్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో ఏకంగా సెంచరీ బాదేశాడు. 83 బంతుల్లో 7 సిక్సులు, 4 ఫోర్లతో విండీస్ కెప్టెన్ అజేయంగా 109 పరుగులు చేసాడు. హోప్ మెరుపు సెంచరీతో విండీస్ భారీ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ సెంచరీ వెనుక భారత మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సలహానే కారణమంటున్నారు హోప్.
 
ఈ మ్యాచ్ అనంతరం ప్రెస్ తో మాట్లాడిన హోప్.. " నేను కొంతకాలం క్రితం ధోనీతో చాట్ చేసాను. అతను నాకొక కీలక సలహా ఇచ్చాడు. నువ్వు ఎంత ఎక్కువ సేపు క్రీజ్ లో ఉండగలిగితే మనం అనుకున్న ఫలితాలు వస్తాయని నాతో చెప్పాడు. ఆ మాట నా మైండ్ లో బలంగా నాటుకుపోయింది. ధోనీ చెప్పిన ప్రకారం జట్టు విజయం కోసం ఎక్కువగా క్రీజ్ లో నిలిచాను. మ్యాచ్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించడం ఆనందంగా అనిపిస్తుంది". అని విండీస్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. 


మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ అంచనాలకు తగ్గట్లు ఆడి 50 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌటైంది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హ్యారి బ్రూక్ 71 పరుగులు చేసి టాప్ స్కోరర్. సాల్ట్ 45, క్రాలి 48, సామ్ కరణ్ 38 పరుగులతో రాణించారు. మిగిలిన ఆటగాళ్లు తలో చేయి వేయడంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసింది. విండీస్ బౌలర్లలో షెపర్డ్, మోటీ, ఒషేం థామస్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. 

326 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో విండీస్ 48.5 ఓవరల్లో 6 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. విండీస్ జట్టును కెప్టెన్ షై హోప్ ముందుండి నడిపించాడు. 83 బంతుల్లో 7 సిక్సులు, 4 ఫోర్లతో విండీస్ కెప్టెన్ అజేయంగా 109 పరుగులు చేసాడు. ఓపెనర్ అతనాజ్ 66 పరుగులతో రాణించగా.. చివర్లో షెపర్డ్ 28 బంతుల్లోనే 3 సిక్సులు, 4 ఫోర్లతో 49 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.  ఇరు జట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 6న, మూడో వన్డే డిసెంబర్ 9న జరుగుతాయి.