హైదరాబాద్, వెలుగు: ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి, అక్కన్న మాదన్న ఆలయాల్లో వచ్చే ఆదివారం నిర్వహించే బోనాల ఉత్సవాలను పకడ్బందీగా, ప్రశాంతంగా చేపట్టాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ ఆదేశించారు. గురువారం లాల్ దర్వాజ మహంకాళి ఆలయం వద్ద పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఆర్అండ్ బీ, దేవాదాయ, వైద్య, మున్సిపల్, అగ్నిమాపక శాఖ అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు చేశారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని స్పష్టంచేశారు. అడిషనల్ పోలీస్ కమిషనర్ విక్రమ్ మాన్ సింగ్, దేవాదాయ శాఖ, సమాచార శాఖ కమిషనర్ ఎం.హనుమంత రావు, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ , డిప్యూటీ పోలీస్ కమిషనర్ స్నేహ మెహ్ర, ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు