- ఉత్తర తెలంగాణ నుంచి లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
- వేడుకల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- ఆదిలాబాద్, నిర్మల్లోముస్తాబైన శైవ క్షేత్రాలు
మంచిర్యాల/ఆదిలాబాద్/నిర్మల్, వెలుగు: మహాశివరాత్రి వేడుకలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి. జైపూర్మండలం వేలాల గట్టు మల్లన్న, బెల్లంపల్లి మండలం బుగ్గ రాజేశ్వరస్వామి, చెన్నూర్ మండలం కత్తెరశాల మల్లికార్జునస్వామి ఆలయాల్లో వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ మూడు క్షేత్రాల్లో మూడు రోజులు పాటు జాతర వైభవంగా జరుగుతుంది.
గొల్ల కురుమల ఆరాధ్య దైవమైన వేలాల గట్టు మల్లన్న జాతరకు ఉత్తర తెలంగాణలోని నలుమూలల నుంచి సుమారు 3 లక్షల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు. శివరాత్రి రోజు సమీపంలోని గోదావరిలో పుణ్యస్నానాలు చేసి గట్టు మల్లన్నకు పట్నాలు వేసి బోనాలు సమర్పించడం ఆనవాయితీ. భక్తులు రాత్రంతా గట్టు మల్లన్నను కొలుస్తూ జాగారం చేస్తారు. మరునాడు వేలాల గ్రామంలోని మల్లికార్జునస్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణోత్సవం కనుల పండువగా జరుగుతుంది. మూడో రోజు జాతర ముగుస్తుంది. ఆర్టీసీ అధికారులు వేలాల జాతర కోసం మంచిర్యాల బస్టాండ్ నుంచి స్పెషల్ సర్వీసులను నడుపుతు న్నారు. జాతరకు వచ్చేవారి సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వేలాల, కత్తెరశాల ఆలయాల్లో జరిగే వేడుకులకు చెన్నూర్ఎమ్మెల్యే డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి హాజరు కానున్నారు.
విద్యుత్ దీపాల మధ్య శివాలయాలు
ఆదిలాబాద్ పట్టణం రవీంద్రనగర్ లోని ఉమామహేశ్వర, శ్రీరాంకాలనీలోని రాజరాజేశ్వర, రాంనగర్లోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి, వినాయక్చౌక్లోని గంగపుత్ర శివాలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. శివలింగాలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
జాగరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు
నిర్మల్ జిల్లాలోని పలు ప్రసిద్ధ శైవ క్షేత్రాలు శివరాత్రి పండుగ వేడుకల కోసం ముస్తాబయ్యాయి. ఆలయాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాత్రివేళ జరిగే జాగరణ కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. జిల్లాలోని చారిత్రక కదిలి పాప హరేశ్వరాలయం, మామడ మండలంలోని బూరుగుపల్లి రాజరాజేశ్వరాలయం, లక్ష్మణచాంద మండలంలోని బాబాపూర్ రాజరాజేశ్వరాలయం, నిర్మల్ పట్టణంలోని ఓంకారేశ్వరాలయం, నగ రేశ్వరాలయం, శివకోటి మందిరం, రథాల గుడి, మల్లన్న గుట్ట హరిహర క్షేత్రం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు.