వేలాల గట్టు మల్లన్న, బుగ్గ రాజన్న సన్నిధిలో వైభవంగా పూజలు

మంచిర్యాల/ఆసిఫాబాద్/జైపూర్/బెల్లంపల్లి/నర్సాపూర్(జి)/కాగజ్​నగర్/లక్సెట్టిపేట,వెలుగు: మహాశివరాత్రి కోసం ఉమ్మడి జిల్లాలోని  శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. శనివారం శివనామస్మరణతో మార్మోగనున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆఫీసర్లు ఏర్పాట్లు పూర్తిచేశారు. మంచిర్యాలలోని విశ్వనాథస్వామి, గోదావరి ఒడ్డునున్న గౌతమేశ్వరస్వామి, చెన్నూర్​లోని ఆగస్త్యేశ్వరస్వామి, కత్తెరశాలలోని మల్లికార్జునస్వామి, దండేపల్లి మండలంలో నర్సాపూర్​లోని భ్రమరాంబిక మల్లికార్జునస్వామి, లక్ష్మీకాంతాపూర్​ గోదావరి ఒడ్డునున్న మల్లికార్జునస్వామి, ద్వారక తీరాన గల గంగమ్మ తల్లి, లక్సెట్టిపేట గోదావరి ఒడ్డున గల గంగాదేవి తదితర ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. ఆలయానికి సుమారు రెండు వందల ఏండ్ల చరిత్ర ఉంది. గ్రామానికి చెందిన కోగిన పుల్లు అనే బాలుడు ఆవులను మేత కోసం గుట్టపైకి తీసుకొని వెళ్తుండేవాడని, ఆవులు మేత మేస్తున్న సమయంలో బాలుడు ఆడుకుంటూ అదృశ్యమై గుట్టపై గల దొనలో గట్టు మల్లన్నగా వెలిశాడని చెప్తుంటారు. భక్తులు దొన దగ్గరికి వెళ్లి తమ సమస్యలు చెప్పుకుంటే మల్లన్న తీరుస్తాడని, కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా ఉంటాడని నమ్మకం. దీంతో ఏటేటా భక్తుల తాకిడి పెరుగుతూ రాష్ట్రంలో పెద్ద జాతరగా మారింది. శివరాత్రి రోజు భక్తులు ఉపవాస దీక్షతో గ్రామ శివారులోని గోదావరినదిలో పుణ్యస్నానాలు ఆచరించి, గట్టు మల్లన్నను దర్శించుకొని బోనాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మల్లన్న పట్నాలు, ఒగ్గు పూజారుల డోలు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతరాజులు, లక్ష్మీదేవర  విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

50 సీసీ కెమెరాలతో నిఘా.....  

వేలాల గట్టు మల్లన్న, బుగ్గ రాజేశ్వరస్వామి ఆలయాల్లో జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసుశాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు  చేసింది. రామగుండం పోలీస్​ కమిషనర్​ రెమా రాజేశ్వరి శుక్రవారం బుగ్గ ఆలయాన్ని సందర్శించి బందోబస్తు సమీక్షించారు. మంచిర్యాల డీసీపీ కేకన్ సుధీర్ రాంనాథ్ ఆధ్వర్యంలో ఇద్దరు ఏసీపీలు,  పది మంది సీఐలు, 16 మంది ఎస్సైలు, 80 మంది ఏఎస్సైలు, హెడ్​కానిస్టేబుళ్లు, 210 మంది కానిస్టేబుళ్లు, 35 మంది మహిళా సిబ్బంది, 124 మంది హోంగార్డ్స్​ మొత్తం 477 మందితో పాటు ఐదు స్పెషల్ టీంలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఏసీపీ నరేందర్​ తెలిపారు. జాతర ప్రాంగణం, గుట్టపై 50 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. అత్యవసర సమయాల్లో జైపూర్ ఏసీపీ నరేందర్ 8712656548, శ్రీరాంపూర్ సీఐ బి.రాజు 8712656549, జైపూర్ ఎస్సై రామకృష్ణ 8712656551లకు ఫోన్ చేయాలన్నారు.

రెండువేల ఏండ్ల చరిత్ర గల బుగ్గ రాజన్న క్షేత్రం... 

రెండు వేల సంవత్సరాల చరిత్ర గల బుగ్గ రాజేశ్వరస్వామి ఆలయం బెల్లంపల్లి పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో వెలిసింది. పూర్వం యతీశ్వరులు, నాగసాధువులు, దిగంబరులు చిత్రకోట పర్వతం నుంచి వలస వచ్చి పెద్దబుగ్గ అరణ్యంలో శివుని కోసం తపస్సు చేశారని ప్రతీతి. ఈసారి జాతరకు లక్ష మందిపైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. శనివారం ఉదయం 4.15 గంటల నుంచి సాయంత్రం వరకు వివిధ పూజలు చేస్తారు. 9.15 గంటలకు శివపార్వతుల కల్యాణం, రాత్రి 12 గంటలకు లింగోద్భవ మహోత్సవం జరుగుతుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు భజన కార్యక్రమాలు, ఆ తర్వాత సాయంత్రం వరకు పూజలు నిర్వహిస్తారు. దిలావర్ పూర్ మండలంలోని కదిలి పాపహరేశ్వర ఆలయం సిద్ధమైంది. అటవీ ప్రాంతంలో కొలువు దీరిన శివుని దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగజ్​నగర్​ఈజ్​గాం శివ మల్లన్న, కౌటాల మండలంలోని తాటిపల్లి వార్ధా నది ఒడ్డున్న కుర్తా హనుమాన్, శివాలయం  ప్రాణహిత తీరంలోని చప్రాడ కార్తీక స్వామి హనుమాన్ ఆలయం ముస్తాబయ్యాయి. ఈస్ గాం మల్లన్న జాతర ఏర్పాట్లను  కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్, రూరల్ సీఐ నాగరాజు, ఆలయ ఈఓ వేణుగోపాల్ గుప్తా,  చైర్మన్ ఇందారపు రాజేశ్వరరావు లలో పరిశీలించారు.