వెలుగు, నెట్‌వర్క్,: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లోని శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. భక్తులు ఉదయం నుంచే ఆయా క్షేత్రాల వద్ద పరమేశ్వరుడి దర్శనం కోసం బారులు తీరారు. భక్తి శ్రద్ధలతో ఈ శ్వరుడిని కొలిచి ఉపవాస దీక్షలు ఆచరించారు. రాత్రి జాగరణ చేసి భజనలు చేశారు. వేములవాడలో ఉదయం నుంచే భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు.
రాజన్న సన్నిధిలో కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గుడి చెరువు స్థలంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జగిత్యాల జిల్లా దుబ్బ రాజన్న సన్నిధికి భక్తులు తరలివచ్చారు. కోరుట్ల, మెట్ పల్లి పట్టణాల్లో శివాలయాల్లో భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. గోదావరిఖని జనగామలో పురాతన త్రిలింగేశ్వరాలయంతో పాటు కోదండరామాలయం, ఐబీ కాలనీ శివాలయం, బసంత్‌నగర్ సమీపంలోని బుగ్గ రాజరాజేశ్వరాలయంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు.
హుజూరాబాద్ మండలంలోని సిర్సపల్లి, బోర్నపల్లి గ్రామాల్లోని శివాలయాల్లో శివరాత్రి పర్వదిన వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రాయికల్ మండలం కొత్తపేట శ్రీ రాజరాజేశ్వరస్వామి నాగాలయంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆలయంలో పూజలు చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గంగాధర మండలం కొండన్నపల్లి సహస్ర లింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ ప్రాంగణంలోని రామలింగేశ్వర ఆలయం, కనగర్తి గ్రామంలోని శివాలయంలో శివపార్వతుల కల్యాన మహోత్సవాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు.