వరంగల్: రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల్లో ఒకటైన వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కరవు కాటకాల నుంచి తమను కాపాడి.. మంచి వర్షాలతో పాడి పంటలు సంమృద్ధిగా పండాలని కోరుకుంటూ శాకాంబరీ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఏటా ఆషాడమాసంలో 15 రోజుల పాటు శాకాంబరీ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాల చివరి రోజున అమ్మవారిని ఆకు కూరలు, పండ్లు, కూరగాయలతో అలంకరిస్తారు. ముస్తాబైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆలయ అధికారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుపొందిన శ్రీ భద్రకాళి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ప్రారంభం కావడంతో దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఓరుగల్లు వాసులు భద్రకాళి అమ్మవారిని తమ ఇలవేల్పు దైవంగా భావిస్తారు. సహస్ర కలశాభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.