T20 World Cup 2024: వీరేంద్ర సెహ్వాగ్ ఎవరు? భారత మాజీపై బంగ్లా క్రికెటర్ ఘాటు వ్యాఖ్యలు

T20 World Cup 2024: వీరేంద్ర సెహ్వాగ్ ఎవరు? భారత మాజీపై బంగ్లా క్రికెటర్ ఘాటు వ్యాఖ్యలు

వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ సూపర్ 8 కు చేరువలో ఉంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్ లాడిన బంగ్లా రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో ఓడిపోయిన ఆ జట్టు శ్రీలంక, నెదర్లాండ్స్ పై నెగ్గింది. నేపాల్ పై మ్యాచ్ ఆడాల్సి ఉంది. గురువారం (జూన్ 13) జరిగిన గ్రూప్‌‌‌‌–డి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో బంగ్లా 25 రన్స్‌‌‌‌ తేడాతో నెదర్లాండ్స్‌‌‌‌పై గెలిచింది. ఈ మ్యాచ్ లో సీనియర్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ కీలక ఇన్నింగ్స్ ఆడి అర్ధ సెంచరీ చేశాడు.

ఇంతవరకు బాగానే ఉన్నా..ఈ మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో టీమిండియా మాజీ  ఓపెనర్ సెహ్వాగ్ పై షకీబ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. ఒక రిపోర్టర్ సెహ్వాగ్ విమర్శలకు మీరేం సమాధానం చెబుతారు అని ప్రశ్నించగా.. సెహ్వాగ్ ఎవరు అని బదులిచ్చాడు. దీంతో షకీబ్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. ప్రపంచంలోకెల్లా షకీబ్ గర్విష్ఠుడని.. దిగ్గజాల పట్ల అతనికి గౌరవం లేదని ఈ బంగ్లా క్రికెటర్ పై విరుచుకుపడుతున్నారు.    

దక్షిణాఫ్రికాపై మ్యాచ్ తర్వాత సెహ్వాగ్ షకీబ్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అనుభవం కోసం జట్టులో తీసుకుంటే షకీబ్ కొంచెం కూడా న్యాయం చేయడం లేదన్నాడు. కొంచెం సేపు కూడా క్రీజ్ లో నిలబడలేకపోయాడని.. షార్ట్ పిచ్ బాల్స్ ఆడడానికి అతను మాథ్యూ హెడెన్‌ లేదంటే ఆడం గిల్‌క్రిస్ట్‌ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సెహ్వాగ్ సెటైర్ విసిరాడు. నువ్వు కేవలం బంగ్లా ఆటగాడివని.. నీ ప్రమాణాలు నువ్వు తెలుసుకొని నీకు తెలిసిన షాట్స్ ఆడాలని షకీబ్ కు సెహ్వాగ్ సలహా ఇచ్చాడు.