బంగ్లాదేశ్ కెప్టెన్,స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కెరీర్ ఒక్క రోజులోనే అనూహ్య మలుపులు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా ఘనవిజయం సాధించిన షకీబ్..అంతకముందు పోలింగ్ బూత్ దగ్గర అభిమానిని చెంపదెబ్బ కొట్టాడు. మగురా-1 నుంచి అవామీ లీగ్ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన హసన్, పోలింగ్ రోజున కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు వెళ్లినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది.
36 ఏళ్ల షకీబ్ కు బంగ్లాదేశ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇండియాలో సచిన్ కు ఉన్న ఫాలోయింగ్ బంగ్లాదేశ్ లో షకీబ్ కు ఉంది. ఇదిలా ఉండగా..ఎంపీగా విజయాన్ని సాధించకముందు షకీబ్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. చాలా మంది అభిమానులు సెల్ఫీ తీసుకోవడానికి అతని దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఈ సమయంలో ఓ అభిమాని షకీబ్ చేయి పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో కోపంతో షకీబ్ చెంపదెబ్బ కొట్టాడు.
మగురా-1 నుంచి అవామీ లీగ్ తరపున ఎన్నికలలో పోటీ చేసిన షకీబ్ అల్ హసన్ 185,388 ఓట్లతో భారీ విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి కాజీ రెజౌల్ హొస్సేన్ 45,993 ఓట్లు సాధించారు.కొద్ది రోజులే ప్రచారం చేసినా భారీ మోజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల ప్రచారం కోసం క్రికెట్‌కు కొద్ది రోజులు షకీబ్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
షకీబ్ తన కోపాన్ని ప్రదర్శించడం ఇదే తొలిసారి కాదు. కొన్నేళ్ల క్రితం, ఢాకా ప్రీమియర్ లీగ్‌లో అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు అతన్ని బీసీబీ సస్పెండ్ చేసింది. తాజాగా అభిమానిని చెంప దెబ్బ కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చివరిసారిగా షకీబ్.. భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ ఆడాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒక అర్ధ సెంచరీతో 186 పరుగులు, బౌలింగ్ లో ఏడు వికెట్లు తీశాడు.
Shakib Al Hasan slapped a fan..!pic.twitter.com/KaUbabgkCX
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 7, 2024