బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు, స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై వ్యభిచార ఆరోపణలు గుప్పుమన్నాయి. కొమిల్లా విక్టోరియన్స్ యజమాని నఫీసా కమల్‌తో కలిసి షకీబ్ తన భార్యను మోసం చేస్తున్నాడని బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. అందుకు సాక్ష్యంగా బంగ్లా ఆల్‌రౌండర్ మరో మహిళతో కలిసి ఉన్న ఫోటోలు పోస్ట్ చేశారు.
ఈ ఆరోపణలకు తోడు షకీబ్ భార్య ఉమ్మీ అహ్మద్ శిశిర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి కొన్ని ఫోటోలు కనిపించకుండా పోవడంతో ఊహాగానాలు మరింత పెరిగాయి. నెటిజెన్స్ ఈ జంటకు విడాకులు కూడా ఇప్పించే ప్రయత్నం చేశారు.
తాజాగా, బంగ్లా ఆల్‌రౌండర్ తనను మోసం చేశాడని పుకార్లు వ్యాప్తి చేస్తున్న అభిమానులపై అతని భార్య అహ్మద్ శిశిర్ విరుచుకుపడింది. భర్తగా, తండ్రిగా షకీబ్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడని వివరణ ఇచ్చింది. సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి ఫోటోలను తాను తొలగించలేదని, వాటిని ప్రైవేట్‌గా ఉంచానని స్పష్టం చేసింది.
నా భర్త నిజాయితీపరుడు
"అతని(షకీబ్) క్రికెట్ కెరీర్‌పై మీకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. నేను దానిని తిరస్కరించను. ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది! మీకు అనిపించినంత అతన్ని విమర్శించండి! కానీ, దయచేసి మా బంధాన్ని వాటితో కలపవద్దు. నా భర్త నిజాయితీపరుడు, పిల్లకు మంచి తండ్రి. మా పట్ల అతను ఎప్పుడూ విధేయుడిగా ఉంటాడు. మమ్మల్ని బాధపెట్టేలా ఏదీ చేయడు. దయచేసి అతని గురించి చెడుగా ప్రచారం చేయకండి.." అని అహ్మద్ శిశిర్ పుకార్లు వ్యాప్తి చేస్తున్న అభిమానులను ఉద్దేశించి ప్రకటన చేసింది.
ప్రేమ.. పెళ్లి
షకీబ్ అల్ హసన్, అహ్మద్ శిశిర్‌లది ప్రేమ వివాహం. డిసెంబర్ 12, 2012న వీరి వివాహం జరగ్గా.. 2015లో ఈ జంటకు మొదటి బిడ్డ (అలైనా) జన్మించింది. వీరికి ఇజా, ఎర్రమ్ అనే మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు.
37 ఏళ్ల షకీబ్ ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నాడు. ఆగస్టు 21 నుండి బంగ్లాదేశ్- పాకిస్తాన్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.
టెస్ట్ సిరీస్ షెడ్యూల్
మొదటి టెస్టు (ఆగస్టు 21 - 25): రావల్పిండి క్రికెట్ స్టేడియం
రెండో టెస్టు (ఆగస్టు 30 - సెప్టెంబర్ 03): కరాచీ నేషనల్ స్టేడియం