కింగ్స్‌టౌన్: టీ20 వరల్డ్ కప్‌లో సూపర్–8 ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జూలు విదిల్చింది. ఆల్‌రౌండర్ షకీబల్ హసన్ (46 బాల్స్‌లో 9 ఫోర్లతో 64 నాటౌట్), తన్జిద్ హసన్ (26 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) రాణించడంతో.. గురువారం జరిగిన గ్రూప్–డి లీగ్ మ్యాచ్‌లో బంగ్లా 25 రన్స్ తేడాతో నెదర్లాండ్స్‌పై గెలిచింది. దీంతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లతో రెండో ప్లేస్‌ను మరింత సుస్థిరం చేసుకుంది. టాస్ ఓడిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 159/5 స్కోరు చేసింది. స్టార్టింగ్‌లోనే ఆర్యన్ దత్ (2/17) తన వరుస ఓవర్లలో నజ్ముల్ హుస్సేన్ (1), లిటన్ దాస్ (1)ని ఔట్ చేయడంతో బంగ్లా23/2తో కష్టాల్లో పడింది. అయితే ఓ ఎండ్‌లో నిలకడగా ఆడుతున్న తన్జిద్‌కు షకీబ్ తోడు కావడంతో పవర్‌ప్లేలో 54/2 స్కోరు వచ్చింది. అయితే 9వ ఓవర్‌లో మీకెరెన్ (2/15) ఈ జంటను విడగొట్టాడు. క్రాస్ సీమ్ బాల్‌ను ఫుల్ చేయబోయిన తన్జిద్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్‌లో డి లీడెకు క్యాచ్ ఇచ్చాడు. మూడో వికెట్‌కు 48 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. తౌహ్రిద్ హ్రిదోయ్ (9) నిరాశపర్చినా, మహ్మదుల్లా (25) మెరుగ్గా ఆడాడు.
షకీబ్‌తో ఐదో వికెట్‌కు 41 రన్స్ జోడించి వెనుదిరిగాడు. చివర్లో జాకెర్ అలీ (14 నాటౌట్) వేగంగా ఆడటంతో ఆరో వికెట్‌కు 29 రన్స్ జత కావడంతో బంగ్లా మంచి టార్గెట్‌ను ఉంచింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 134/8 స్కోరు చేసింది. సైబ్రాండ్ (22 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 33) టాప్ స్కోరర్. ఓపెనర్లు మైకేల్ లెవిట్ (18), మ్యాక్స్ ఓ డౌడ్ (12) మెరుగైన ఆరంభాన్నివ్వలేదు. అయితే సైబ్రాండ్ రెండు కీలక భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌ను కాపాడే ప్రయత్నం చేశాడు. విక్రమ్‌జిత్ సింగ్ (26)తో, మూడో వికెట్‌కు 37, స్కాట్ ఎడ్వర్డ్స్ (25)తో నాలుగో వికెట్‌కు 42 రన్స్ జత చేశాడు. కానీ 15వ ఓవర్‌లో రషీద్ (3/33) డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. మూడు బాల్స్ తేడాలో సైబ్రాండ్, బాస్ డి లీడె (0)ను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. తన తర్వాతి ఓవర్‌లో వాన్ బీక్ (2)ను పెవిలియన్ చేర్చాడు. మధ్యలో ఎడ్వర్డ్స్ కూడా వెనుదిరగడంతో డచ్ కోలుకోలేకపోయింది. టిమ్ ప్రింగ్లి (1), ఆర్యన్ దత్ (15 నాటౌట్) మిగతా లక్ష్యాన్ని అందుకోలేకపోయారు. షకీబ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.