ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు సౌత్‌లో మంచి డిమాండే ఉంది. అయితే ఇద్దరు హీరోయిన్లు లీడ్ రోల్ చేసే సినిమాలు చాలా అరుదు. అందుకే ‘శాకిని డాకిని’ల కథపై అందరికీ ఆసక్తి కలిగింది. పైగా కొరియన్ సూపర్‌హిట్ ‘మిడ్‌నైట్ రన్నర్స్’కి ఇది రీమేక్ కావడం ఎక్స్పెక్టేషన్స్ ను పెంచింది. మరి ఈ సినిమా ఆశించిన స్థాయిలోనే ఉందా? అంచనాలను అందుకుందా?
కథేమిటంటే..
శాలిని (నివేద), దామిని (రెజీనా) ట్రైనింగ్ కోసం పోలీస్ అకాడెమీకి వస్తారు. ఇద్దరికీ ఒక్క క్షణం పడదు. ఇగోతో గొడవ పడుతూనే ఉంటారు. ఒకరిని ఒకరు ఇరికించుకోవాలని ట్రై చేస్తూనే ఉంటారు. ఓసారి ఔటింగ్‌కి వెళ్లినప్పుడు ఒకమ్మాయి కిడ్నాప్ అవ్వడం వారి కంటపడుతుంది. పోలీసులకు చెప్పినా ఆ విషయం పట్టించుకోరు. దాంతో ఆ అమ్మాయిని తామే సేవ్ చేయాలని ఈ ఇద్దరూ అనుకుంటారు. అది వాళ్లని చాలా సమస్యల్లోకి నెడుతుంది. అసలా అమ్మాయి ఎవరు, ఎందుకు కిడ్నాప్ అయ్యింది, తనని వీళ్లు కాపాడగలిగారా లేదా అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే..
ఇదేమీ కొత్త కథ కాదు. కిడ్నాపులు, దాని వెనుక కారణాలు, విక్టిమ్స్ ను సేవ్ చేయడానికి లీడ్ యాక్టర్లు చేసే సాహసాలు చాలా సినిమాల్లో చూసేశాం. కాకపోతే దీన్ని ఫిమేల్ సెంట్రిక్‌గా తీయడమనేది కొత్త ఫీల్‌ని ఇస్తుంది. ఒరిజినల్‌లో ఇద్దరు అబ్బాయిలు నటించిన కథకి ఇద్దరు అమ్మాయిల్ని తీసుకోవాలని మన ఫిల్మ్ మేకర్స్ అనుకోవడానికి కారణం అదే కావచ్చు. కొరియన్ మూవీని మన నేటివిటీకి తగ్గట్టు మార్చడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. అందుకే ఇది రీమేక్ అనే భావన ఎక్కడా కలగదు. అలాగే క్యారెక్టరయిజేషన్స్ కూడా బాగున్నాయి. హీరోయిన్లిద్దరూ మంచి ఆర్టిస్టులు కావడంతో స్ట్రాంగ్‌గా కనిపించారు. ఎప్పుడూ సీరియస్ పాత్రల్లో కనిపించే రెజీనా ఇందులో కాస్త నవ్వుల్ని కూడా పూయించడం బాగుంది. ఇద్దరి మధ్య ఇగో క్లాషెస్‌ని కూడా ఫన్నీగా చూపించి ఆకట్టుకున్నారు.
అయితే స్క్రీన్ ప్లేతోనే వచ్చింది సమస్య. క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ టైమ్ తీసేసుకోవడంతో సినిమా మొదలవడమే కాస్త మెల్లగా మొదలవుతుంది. అమ్మాయి కిడ్నాప్ అయ్యేవరకు ఎక్కడా ట్విస్టులు లేవు. దాంతో ఫ్లాట్‌గా అనిపిస్తుంది. కిడ్నాప్ జరిగినప్పుడు హమ్మయ్య, ఏదో జరుగుతోంది అనే క్యూరియాసిటీ కలుగుతుంది. అయితే ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది. ఎందుకంటే కిడ్నాప్ అయిన అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో హీరోయిన్లు ఓ పెద్ద రహస్యాన్ని కనిపెడతారు. చాలామంది విక్టిమ్స్ ఉంటారు. వారి తాలూకు ఎమోషన్‌ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల ప్రేక్షకులు ఇన్‌వాల్వ్ అవ్వలేడు. ఏదో జరుగుతోంది, వాళ్లేదో చేస్తున్నారు అన్నట్టే కథ నడిచిపోతుంది తప్ప ఆ పాత్రల తాలుకు పెయిన్‌ని ఫీలయ్యే అవకాశమే మనకి దొరకదు. రెగ్యులర్ ఫార్మాట్‌లో.. ఎప్పుడూ చూసే రొటీ సీన్లతోనే లాగించేయడంతో సెకెండాఫ్ మరింత బోరింగ్‌గా తయారైంది. కొన్ని సీన్స్ లో లాజిక్ కూడా మిస్సయ్యింది. అక్కడక్కడా పండిన కొద్దిపాటి కామెడీ మాత్రమే ఈ మొత్తం ప్రాసెస్‌లో రిలీఫ్.
బేసిగ్గా ఇదొక థ్రిల్లర్. లీడ్ యాక్టర్లు అనుకోకుండా ఒక సంఘటనకు కనెక్టయ్యి, అక్కడి నుంచి ఎవరికీ తెలియని కొన్ని కొత్త విషయాలను యాదృచ్ఛికంగా బైటికి లాగాల్సి ఉంటుంది. ఇలాంటి కథ తీసుకున్నప్పుడు ఊహించని మలుపులు ఉండాలి. బలమైన అంశాలు, అందుకు తగిన కారణాలు ఉండాలి. ఎమోషన్ ఉండాలి. ఎలివేషన్స్ బాగుండాలి. అన్నిటి కంటే ముఖ్యంగా స్పీడ్ ఉండాలి. ప్రేక్షకులకు ఊపిరాడనివ్వకుండా చేయాలి. ఈ తరహా కాన్సెప్టుల్లో ఇవన్నీ మిస్సయ్యాయి అంటే అదొక రొటీన్ సినిమాగా మిగిలిపోతుంది. ఇక్కడ అదే జరిగింది. ఒకట్రెండు చోట్ల భావోద్వేగాలు బాగానే అనిపించినా.. మొత్తంగా మనం కోరుకున్నదేదో మిస్సైన ఫీలింగ్‌తోనే బైటికి రావాల్సి వస్తుంది.
ఎవరెలా చేశారంటే..
నివేద నటన గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఎంత బరువైన పాత్రయినా ఈజీగా చేసేస్తుంది. తనకి శాలిని పాత్ర పోషించడం చాలా తేలిక. అయితే ఎప్పటిలా హెవీగానే కాకుండా అన్ని షేడ్స్ ఉన్నాయి పాత్రలో. దాన్ని ఆమె అద్భుతంగా పోషించింది. న్యాయం చేసింది. ఇక రెజీనా కూడా దామినిగా పర్‌ఫెక్ట్ అనిపించింది. హీరోలకు తగ్గకుండా యాక్షన్ సీన్స్ ను పండించింది. అయితే తన లుక్ కాస్త డల్‌గా అనిపించింది. హీరోయిన్లిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం బాగా కుదిరింది. మిగతా పాత్రలన్నీ అవసరం కోసం ఉన్నవే తప్ప వాటికంటూ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. సినిమా మొత్తం వీళ్లిద్దరి చుట్టూనే తిరగడం వల్ల మిగతా వారెవ్వరికీ ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చేయాల్సినంత స్కోప్ దొరకలేదనే చెప్పాలి. కానీ ఎవరికి వారు పరిధి మేర తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఇక టెక్నికల్ విషయాలు. మ్యూజిక్ సినిమాకి తగ్గట్టుగా ఉందని చెప్పుకోవాలే తప్ప ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. సినిమాకి కాస్తో కూస్తో ప్రత్యేకతని తీసుకొచ్చింది. నిర్మాణ విలువలు బానే ఉన్నాయి. అయితే దర్శకుడిగా సుధీర్ వర్మ మార్క్ కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే అతని టేకింగ్ ఫ్లాట్‌గా ఉండదు. హిట్టూ ఫ్లాపుల సంగతి పక్కన పెడితే తన నేరేషన్‌లో స్పీడ్ ఉంటుంది. కొన్ని మలుపులు, మెరుపులు కనిపిస్తాయి. అలాంటివేమీ లేకపోవడంతో ఇదసలు అతను తీసిన సినిమాయేనా అనిపిస్తుంది. నిర్మాతలతో అతనికి క్లాష్ వచ్చిందని ప్రచారం జరగడం, అతను ప్రమోషన్స్ కు కూడా హాజర్ కాకపోవడం వల్ల ఏర్పడిన అనుమానాలు సినిమా చూశాక మరింత బలపడతాయి. ఈ సినిమాలో అతని ఇన్‌వాల్వ్మెంట్ ఎంత అనే ప్రశ్నను ప్రేక్షకుడి మనసులో రేకెత్తిస్తాయి.
కొసమెరుపు: శాకిని డాకిని స్లో అయ్యారు
నటీనటులు: నివేదా థామస్, రెజీనా కసాండ్రా, భానుచందర్, పృథ్వి, చమ్మక్ చంద్ర, సుదర్శన్, రవివర్మ, కబీర్ దుహాన్ సింగ్ తదితరులు
సంగీతం: మైకీ మెక్‌క్లియరీ
నిర్మాణం: సురేష్‌బాబు, సునీత తాటి, హ్యన్‌వూ థామస్ కిమ్
దర్శకత్వం: సుధీర్ వర్మ