- బీజేపీ నేతలకు మంత్రి తలసాని సవాల్
- దేశానికి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తారని మోడీకి భయం
- సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని ఆరోపణలు
- బీసీలకు మోడీ ఏం చేశారు?: గంగుల
హైదరాబాద్, వెలుగు: ‘‘దమ్ముంటే పార్లమెంట్‌ను రద్దు చేయండి.. మేం సీఎం కేసీఆర్‌ను ఒప్పించి అసెంబ్లీని రద్దు చేయిస్తం.. ఎవరు గెలుస్తరో ప్రజలు తేలుస్తరు.. ఎలక్షన్లకు వెళ్లే దమ్ముందా..’’ అని బీజేపీ నేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. తెలంగాణకు ఎనిమిదేండ్లలో మోడీ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రోజుకు పది డ్రెస్సులు మార్చడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ‘‘తనకు తాను పహిల్వాన్ అనుకుంటున్నారు. హైదరాబాద్ పర్యటనలో ఎవరిని కూడా మనుషుల్లా చూడలేదు. స్కీంల పేర్లు మారుస్తున్నామని విమర్శలు చేస్తున్నారు. డబుల్ బెడ్రూం స్కీంలో కేంద్రం వాటా ఎంతో చెప్తారా?” అని ప్రశ్నించారు.
తాటాకు చప్పుళ్లకు తాము బెదరబోమని తలసాని తేల్చి చెప్పారు. ‘‘దావోస్ సమ్మిట్‌లో కేంద్ర మంత్రులు ఉన్నా వాళ్లను ఎవరూ పట్టించుకోవడం లేదు. అక్కడే ఉన్న మంత్రి కేటీఆర్‌కు మంచి ఆదరణ లభిస్తున్నది. రేపు దేశానికి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తారని మోడీ భయపడుతున్నారు’’ అని తలసాని అన్నారు. శుక్రవారం టీఆర్‌ఎస్ ఎల్పీలో మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై ప్రధాని మోడీ మరోసారి అక్కసు ప్రదర్శించారని దుయ్యబట్టారు.
మోడీ ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆయా రాష్ట్రాల సీఎంలు ఆయనను స్వాగతించడం లేదని, దీనిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల టైంలో మోడీ భారత్ బయోటెక్‌కు వచ్చినప్పుడు సీఎంను రావొద్దని ప్రధాని ఆఫీస్ నుంచే చెప్పారని, అప్పటి నుంచి ఈ సంప్రదాయానికి బీజం పడిందన్నారు. బీజేపీలో కుటుంబ రాజకీయాలు లేవా? అని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని, తెలంగాణతో పోటీ పడే బీజేపీ పాలిత రాష్ట్రం ఏదైనా ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అమలవుతున్న స్కీంలను కేసీఆర్ రేపు దేశవ్యాప్తంగా అమలు చేస్తారని తలసాని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ దేశవ్యాప్తంగా చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సమాఖ్య స్ఫూర్తిని మోడీ దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రాల అధికారాలను గుంజుకోవడానికి దేశం ఏమైనా ఆయన జాగీరా? అని ప్రశ్నించారు.
‘‘మూఢ నమ్మకాలకు బీజేపీ పెట్టింది పేరు. యూపీ ఎన్నికల్లోనూ మూఢ నమ్మకాలను ఉపయోగించుకొని గెలిచారు. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న సంజయ్‌కు మోడీ క్లాస్ పీకుతారని అనుకున్నాం. కానీ అలా చేయకుండా సంజయ్‌ను సమాజం మీదకు వదిలారు. సికింద్రాబాద్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలి” అని డిమాండ్ చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కులాల మధ్య చీలిక తెచ్చేలా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్‌లోని ఇతర కులాల నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఆ పార్టీలో ఉంటారని ప్రశ్నించారు.
మోడీ.. దేశానికి పట్టిన శని: జీవన్ రెడ్డి
ప్రధాని మోడీ దేశానికి పట్టిన శని అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ మాయం కావడం ఖాయమన్నారు. రౌడీలకు బీజేపీ అడ్డాగా మారిందని ఆరోపించారు. శుక్రవారం ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, బాల్క సుమన్ తో కలిసి టీఆర్‌ఎస్ ఎల్పీలో జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణలో ఐటీని అభివృద్ధి చేస్తామంటే స్వాగతిస్తాం. జీవో 111 ఎత్తేశాం. 1.63 లక్షల ఎకరాల భూమి సిద్ధంగా ఉంది” అని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఇజం తప్ప మరొకటి నడువదని చెప్పారు.
కేసీఆర్ ప్రభంజనాన్ని తట్టుకోలేరు: లింగయ్య
కేసీఆర్ ఎజెండాతో కేంద్రంలో పీఠం కదులుతుందని బీజేపీ నేతలు భయపడుతున్నారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం టీఆర్‌ఎస్ ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభంజనాన్ని బీజేపీ, కాంగ్రెస్ తట్టుకోలేవని పేర్కొన్నారు.
బీసీలకు మోడీ ఏం చేశారు?: గంగుల
కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఉద్యమం నుంచే ఉన్నదని, ప్రజలు ఎన్నుకుంటేనే గెలిచి వచ్చారు తప్ప కుటుంబ రాజకీయాలతో కాదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ‘‘ప్రధాని మోడీ తనది 56 ఇంచుల ఛాతి అని చెప్పుకోవడం తప్ప బీసీలకు ఒక్క ఇంచ్ కూడా చేసిందేమీ లేదు. కేంద్రంలో కనీసం బీసీ మంత్రిత్వ శాఖ కూడా లేదు. బీసీ కుల గణనపైనా నిర్ణయం తీసుకోలేదు. వాళ్లు ఆరోపిస్తున్న కుటుంబ పాలనలోనే బీసీలకు మేలు జరుగుతోంది” అని ఆయన పేర్కొన్నారు. మతకల్లోలాలు సృష్టించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయాలని బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు
ఆస్థాన కవిగా సోనూసూద్..పోస్టర్కు సూపర్ రెస్పాన్స్
గోల్డ్ మెడల్ సాధించడం గర్వంగా ఉంది