రోహిత్ శర్మ అంత లావుగా ఉన్నా.. కెప్టెన్ గా ఎందుకు కొనసాగిస్తున్నారు : కాంగ్రెస్ మహిళా నేత

రోహిత్ శర్మ అంత లావుగా ఉన్నా.. కెప్టెన్ గా ఎందుకు కొనసాగిస్తున్నారు : కాంగ్రెస్ మహిళా నేత

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. వయస్సు 37 ఏళ్లు.. 18 సంవత్సరాలుగా టీమిండియా జట్టులో కొనసాగుతున్నాడు. 37 ఏళ్ల వయస్సులోనూ అన్ని ఫార్మెట్లలో రాణిస్తున్న కెప్టెన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రోహిత్ శర్మ. రిటైర్ మెంట్ పై కొన్నేళ్లుగా విమర్శలు వస్తున్నా.. బీసీసీఐ మాత్రం రోహిత్ శర్మ విషయంలో గట్టిగా నిలబడి మరీ అవకాశాలు ఇస్తూ ఉంది.. జట్టులో కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ శరీరం తీరు.. అతని ఆటతీరుపై మాజీ క్రికెట్ మాజీ జర్నలిస్ట్, కాంగ్రెస్ మహిళా నేత షామీ మొహమ్మద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇంతకీ రోహిత్ శర్మను ఉద్దేశించి షామీ చేసిన వ్యాఖ్యలు ఏంటో చూద్దాం..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అధిక బరువుతో ఉన్నారు.. బరువు తగ్గాల్సి ఉంది.. టీమిండియాలో ఇప్పటి వరకు ఉన్న అందరి కెప్టెన్లలో.. ఆకట్టుకోని విధంగా ఉన్నది ఒక్క రోహిత్ శర్మనే అంటూ తన అకౌంట్ నుంచి పోస్టులు పెట్టారు మాజీ జర్నలిస్ట్, కాంగ్రెస్ మహిళా నేత షామీ మొహమ్మద్. ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ లో రోహిత్ శర్మ 17 బంతుల్లో 15 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్ ను టీమిండియా 44 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత షామీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. 

షామీ మొహమ్మద్ వ్యాఖ్యలపై పాజిటివ్, నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి సోషల్ మీడియాలో. గంగూలీ, ద్రవిడ్, ధోనీ, కోహ్లీ, కపిల్ దేవ్, రవిశాస్త్రి వంటి మిగతా కెప్టెన్లతో పోలిస్తే.. రోహిత్ శర్మ ఒక సాధారణ కెప్టెన్ మాత్రమే.. టీమిండియా కెప్టెన్ అయ్యే అదృష్టం పొందిన ఓ సాధారణ ఆటగాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ.. షామీ మొహమ్మద్ కు మద్దతు తెలుపుతున్నాయి.

బీజేపీ వాళ్లు అయితే నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. రోహిత్ శర్మ భారత్ కు ప్రపంచ కప్ తెచ్చాడు.. రాహుల్ గాంధీ సొంత పార్టీని కూడా గందరగోళంలో ముంచాడు అంటూ ఎటాక్ మొదలుపెట్టారు. 

షామీ మొహమ్మద్ వ్యాఖ్యలపై ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ స్పందించారు. రోహిత్ శర్మ కెప్టెన్ గా అనేక ఐపీఎల్ టైటిల్స్ ను టీమిండియా గెలిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలని.. ప్రపంచంలోనే అత్యుత్తమ వైట్ బాల్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడంటూ కామెంట్ చేశారు. రాజ్ దీప్ వ్యాఖ్యలకు షామీ కౌంటర్ ఇచ్చారు. 2024 డిసెంబర్ లో జరిగిన టోర్నమెంట్ లో ఓపెనర్ గా ఆడాలనే నిర్ణయం బెడిసికొట్టింది. రోహిత్ ఆధ్వర్యంలోని జట్టు 2023 ప్రపంచ కప్ ఫైనల్ లో ఓడిపోయిందని.. ఇది మర్చిపోయారా అంటూ షామీ రివర్స్ ఎటాక్ చేశారు. 

37 ఏళ్ల రోహిత్ శర్మ కెప్టెన్సీపైనే కాదు.. అతని బాడీ షేమింగ్.. లావుగా ఉండటంపై గతంలోనూ సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వచ్చాయి. ఈసారి కాంగ్రెస్ మహిళా నేత ఈ కామెంట్స్ చేయటంతో ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పార్టీ మధ్య మాటల యుద్ధంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపోటములపై రోహిత్ శర్మ కెరీర్ ఆధారపడి ఉందనేది ఎక్కువగా వినిపిస్తున్న మాట.. చూడాలి మరి..