ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 వచ్చే (మార్చ్) నెలలో ప్రారంభం కానుంది. అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా మార్చ్ 22 నుంచి ఈ మెగా లీగ్ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జయింట్స్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ స్థానంలో వెస్టిండీస్ నయా సంచలనం షమర్ జోసెఫ్‌ను నేడు (ఫిబ్రవరి 10) ఎంపిక చేసింది. జోసెఫ్ 3 కోట్ల రూపాయలతో లక్నో జట్టులో చేరనున్నాడు.
2023 ఐపీఎల్ సీజన్ లో మార్క్ వుడ్ ఒక్క మ్యాచ్ లో మినహా పెద్దగా ఆకట్టుకోలేదు. 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసే ఈ ఇంగ్లీష్ పేసర్ ఐపీఎల్ లో తేలిపోయాడు. దీంతో లక్నో యాజమాన్యం అతన్ని తప్పించింది. కేఎల్ రాహుల్ ఈ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. విండీస్ ఫాస్ట్ బౌలర్ జోసెఫ్ ఒక్క సిరీస్ తోనే ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ముఖ్యంగా గబ్బాలో జరిగిన రెండో టెస్టులో ఈ యువ పేసర్ ఆసీస్ వెన్ను విరిచి వెస్టిండీస్ కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్ లో 216 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ కు చుక్కలు చూపించాడు. 7 వికెట్లు తీసుకొని విండీస్ కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. నాలుగో రోజు ఆటలో మొత్తం 8 వికెట్లు పడగా..కేవలం 11 ఓవర్లలోనే షమర్7 వికెట్లు పడగొట్టాడు. అంతక ముందు స్టార్క్ వేసిన బౌన్సర్ కు గాయపడిన షమర్.. గాయాన్ని సైతం లెక్క చేయకుండా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్ లో కూడా అడపా దడపా మెరుపులు మెరిపించగలడు.
Shamar Joseph replaces Mark Wood in Lucknow in IPL 2024. pic.twitter.com/LrwTsaN70w
— Johns. (@CricCrazyJohns) February 10, 2024