అతిథులను కాపాడడంలో ఫెయిలయ్యా.. ఉగ్రదాడిని సాకుగా చూపి రాష్ట్ర ప్రత్యేక హోదా అడగను: ఒమర్​ అబ్దుల్లా

అతిథులను కాపాడడంలో ఫెయిలయ్యా.. ఉగ్రదాడిని సాకుగా చూపి రాష్ట్ర ప్రత్యేక హోదా అడగను: ఒమర్​ అబ్దుల్లా
  • వారి కుటుంబాలకు ఎలా క్షమాపణ చెప్పాలో తెలియడం లేదు
  • ప్రజలంతా వెంట ఉంటే ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్న జమ్మూకాశ్మీర్​ సీఎం
  • బైసరన్​లో ఇంత పెద్దస్థాయిలో దాడి 21 ఏండ్లలోనే తొలిసారి
  • ప్రజలంతా వెంట ఉంటే ఉగ్రవాదాన్ని అంతం చేస్తా
  • పహల్గాం​ దాడిపై జమ్మూకాశ్మీర్​ అసెంబ్లీ అత్యవసర సమావేశం

శ్రీనగర్: తమ ప్రాంతంలో సేద తీరేందుకు వచ్చిన అతిథులను కాపాడడంలో తాను విఫలమయ్యానని జమ్మూకాశ్మీర్​ సీఎం ఒమర్​ అబ్దుల్లా అన్నారు. సీఎంగా, పర్యాటకశాఖ మంత్రిగా వారికి భద్రత కల్పించలేకపోయానని, బాధిత కుటుంబాలకు ఎలా క్షమాపణలు చెప్పాలో కూడా తెలియడం లేదని వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడిపై చర్చించేందుకు సోమవారం జమ్మూకాశ్మీర్​ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ఒమర్​అబ్దుల్లా బావోద్వేగంగా మాట్లాడారు. 

జమ్మూకాశ్మీర్​లో ఇలాంటి దాడులు చాలా చూశామని, కానీ, బైసరన్​లో ఇంత పెద్ద దాడి జరగడం మాత్రం 21 ఏండ్లలో ఇదే మొదటిసారని చెప్పారు. తమ ప్రాంతానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా పంపాల్సిన బాధ్యత తనదేనని, కానీ ఆ పని చేయలేకపోయానని అన్నారు. ఆ 26 మంది ప్రాణాలను అడ్డం పెట్టుకొని ఇప్పుడు తాను కేంద్రాన్ని రాష్ట్ర హోదా డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయబోనని తెలిపారు. ఇదివరకు జమ్మూకాశ్మీర్​కు స్టేట్​ హోదా అడిగానని, కానీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని అడగాలని అన్నారు. ఈ విషయాన్ని మరేదైనా రోజు లేవనెత్తుతానని చెప్పారు.

ఇది టెర్రరిజం అంతానికి నాంది

పహల్గాం​ దాడిని నార్త్​ టు సౌత్, ఈస్ట్​ టు వెస్ట్​  ఇలా దేశంలోని ప్రతి ప్రాంతం ఖండించిందని ఒమర్​అబ్దుల్లా చెప్పారు. అలాగే, ఈ దాడికి వ్యతిరేకంగా మొత్తం కాశ్మీర్​ ఐక్యంగా ఉన్నదని తెలిపారు.  రెండు దశాబ్దాల తర్వాత జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంత పెద్ద ఎత్తున జరిగిన దాడికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలపడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఈ లోయలో టెర్రరిజం అంతానికి ఇది నాంది అని అన్నారు. ‘‘ఈ ఉద్యమానికి హాని కలిగించేది ఏదీ మాట్లాడకూడదు, చేయకూడదు. 

మేం ఉగ్రవాదాన్ని తుపాకులతో అదుపు చేయగలం.. కానీ, మాకు ప్రజల మద్దతు అవసరం’’ అని పేర్కొన్నారు. ఓ పర్యాటకుడిని రక్షించడానికి ప్రయత్నించి, ఉగ్రవాదుల చేతిలో మరణించిన పోనీ రైడ్ ఆపరేటర్ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా త్యాగాన్ని కొనియాడారు. గాయపడ్డవారిని భుజాలపై మోస్తూ.. వారికి ఉచిత సేవలు చేస్తూ చాలామంది కాశ్మీరీలు ఉదారతను చాటుకున్నారని తెలిపారు.

పహల్గాం​ దాడిపై అసెంబ్లీలో తీర్మానాలు

జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ పహల్గాం మృతులకు సంతాపం ప్రకటించింది. సభ్యులంతా 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. పహల్గాం​ దాడిని హీనమైన, అమానవీయ చర్యగా తీర్మానంలో పేర్కొన్నారు.  దీనిని కాశ్మీరిపై, దేశ ఐక్యతపై దాడిగా అభివర్ణించారు. ఈ దాడికి పాల్పడినవారిని చట్ట ప్రకారం శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు మద్దతు ప్రకటించారు. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ తీర్మానం కోరింది. 

బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం, వైద్య సంరక్షణ, పునరావాసం కోసం తీర్మానించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్-గ్రేషియా ప్రకటించింది. పర్యాటక ప్రాంతాల్లో భద్రతను బలోపేతం చేయాలని, ఇంటెలిజెన్స్ వ్యవస్థను మెరుగుపరచాలని తీర్మానించింది.  ఉగ్రవాదాన్ని ఖండిస్తూ, రాష్ట్రంలో శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేయాలని పిలుపునిచ్చింది.