న్యూఢిల్లీ : గాయం నుంచి కోలుకున్న పేసర్ మహ్మద్ షమీ ఏడాది తర్వాత క్రికెట్‌లోకి అద్భుతంగా రీ ఎంట్రీ ఇచ్చాడు. మధ్యప్రదేశ్‌తో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన షమీ 19 ఓవర్లు వేసి నాలుగు వికెట్లు తీశాడు. ప్రస్తుతం అతను మంచి ఫిట్‌నెస్‌తో కనిపిస్తున్నాడు. ఒకవేళ రెండో ఇన్నింగ్స్ తర్వాత షమీ శరీరంలో ఎలాంటి నొప్పి, వాపు లేకపోతే ఆసీస్‌కు పంపడం ఖాయంగా కనిపిస్తోంది.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే పెర్త్‌లో జరిగే తొలి టెస్ట్‌కు ముందే షమీ టీమిండియాతో కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. షమీ అక్కడి వెళ్లిన తర్వాత మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ప్రైమినిస్టర్ ఎలెవన్‌తో రెండో రోజుల వామప్ మ్యాచ్ ఆడనున్నాడు. షమీ బౌలింగ్, ఫిట్‌నెస్‌ను పరిశీలించేందుకు సెలెక్టర్ అజయ్ రాత్రాతో పాటు ఎన్‌సీఏ స్పోర్ట్స్ సైన్స్ హెడ్ డాక్టర్ నితిన్ పటేల్ స్టేడియానికి వచ్చారని క్యాబ్ వర్గాలు తెలిపాయి.
వీళ్లు ఇచ్చే నివేదికను సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మకు పంపనున్నారు. ఈ ముగ్గురు ఓకే చెబితే షమీ ఆసీస్‌కు బయలుదేరే చాన్స్ కనిపిస్తోంది.