![బస్టాప్‌లోని యువతులను ఢీకొట్టిన రెడీమిక్స్ లారీ.. శామీర్‌పేటలోని బిట్స్ జంక్షన్లో ఘటన](https://static.v6velugu.com/uploads/2025/02/2-sisters-critically-injured-as-readymix-lorry-hits-them_AO5LwXJ4Qo.jpg)
శామీర్ పేట, వెలుగు: మేడ్చల్‌జిల్లా శామీర్‌పేట పరిధిలోని బస్టాపులో వేచి ఉన్న ఇద్దరు యువతులను రెడీమిక్స్లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. తూముకుంట మున్సిపాలిటీ అంతాయిపల్లికి చెందిన కొరివి గాయత్రి(24), కొరివి భవాని(19) అక్కాచెల్లెళ్లు(అన్నదమ్ముల పిల్లలు). సోమవారం ఉదయం తిరుమలగిరిలోని ప్రైవేట్కంపెనీలో డ్యూటీకి వెళ్లేందుకు బిట్స్ జంక్షన్ వెదురువనం బస్టాప్‌కు వచ్చారు.
బస్సు కోసం అక్కడ నిలబడి ఉండగా, కీసర వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన రెడీమిక్స్ లారీ వీరిని ఢీకొట్టింది. ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయత్రి, భవాని తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని కొంపల్లిలోని శ్రీకర్ హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న అంతాయిపల్లి వాసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు.
మేడ్చల్ కలెక్టరేట్సమీపంలోని జంక్షన్లో స్పీడ్‌బ్రేకర్లు, సీసీ కెమెరాలు లేకపోవడం దారుణమని మండిపడ్డారు. స్పీడ్‌బ్రేకర్లు ఉంటే ప్రమాదం జరిగేది కాదన్నారు. నిత్యం కలెక్టర్తిరిగే రూట్లో ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. టైర్లు తగలబెడుతూ నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. శామీర్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గాయత్రి, భవాని పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.