శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మున్సిపాలిటీ రాళ్లగూడలో జరిగిన బాలిక హత్య కేసును ఎయిర్ పోర్టు పోలీసులు ఛేదించారు. ప్రేమించిన మేనమామే అత్యంత దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. ఎయిర్‌పోర్టు పీఎస్ డీసీపీ కె.నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన పద్మ, లక్ష్మయ్య దంపతులు కొంతకాలంగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మధురానగర్ లో నివాసముంటున్నారు. వీరికి భారతి(16) అనే కూతురు ఉంది. ఈనెల 11వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన భారతి తిరిగి రాలేదు.
తల్లిదండ్రులు ఎయిర్‌పోర్టు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 14న రాళ్లగూడ సర్వీస్ రోడ్డు పక్కన చెట్ల పొదల్లో బాలిక డెడ్‌బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా భారతి డెడ్‌బాడీ అని తేలింది. హత్యకు గురైనట్లు నిర్ధారించి, బాలిక ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఆమె మేనమామ విష్ణు(23) తో ఎక్కువసార్లు మాట్లాడినట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. విష్ణు, భారతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆమెకు మాయమాటలు చెప్పి విష్ణు శారీరకంగా లొంగదీసుకున్నాడు. ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇద్దరినీ హెచ్చరించారు.
ఈ క్రమంలో విష్ణును భారతి నాలుగు నెలలుగా దూరం పెట్టింది. అయితే, వేరే వ్యక్తితో చనువుగా ఉంటోందని అనుమానం పెంచుకున్న విష్ణు భారతిని చంపేయాలనుకున్నాడు. ఈనెల 11న మాట్లాడుదామని రాళ్లగూడకు పిలిపించి ఎవరూలేని ప్రాంతంలో బండరాయితో తలపై పలుమార్లు దాడి చేసి చంపేశాడు. నిందితుడిని సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు రిమాండ్‌కు
తరలించారు.