
రంగారెడ్డి జిల్లా : శంషాబాద్ అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని గవర్నర్ తమిళి సై సందర్శించారు. అదే సమయంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. గవర్నర్ తమిళి సై రాకతో అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆలయ అధికారులు గవర్నర్ కు దగ్గరుండి ప్రత్యేక పూజలు నిర్వహించి.. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంలో స్వామివారి దర్శనం సమయంలో గవర్నర్ తమిళి సై, ఎమ్మెల్సీ కవిత మర్యాద పూర్వకంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. పూజల్లో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. దర్శనం అనంతరం గవర్నర్ ఆలయం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.
అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శంషాబాద్ మండలం జెడ్పీటీసీ నిరటి తన్వి రాజు ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, US కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు. ఆలయ అధికారులకు ముందస్తు సమాచారం లేకుండా అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని గవర్నర్ తమిళిసై సందర్శించారని తెలుస్తోంది.