
హైదరాబాద్: కడ్తాల పోలీస్ స్టేషన్ పరిధి బటర్ ఫ్లై వెంచర్ లోని విల్లాలో జూన్ 4న జరిగిన ఇద్దరు యువకుల దారుణ హత్యను శంషాబాద్ పోలీసులు చేధించారు. జంట హత్య కేసు వివరాలను శుక్రవారం శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కేసులో నిందితులైన A1 రవి అతని స్నేహితులు A2 పలస నాగరాజు గౌడ్, A3 తాళ్ల కొండ రాజు, A4 విజయ్, A5 ప్రవీణ్, A6 శేఖర్, A7 జగదీష్ గౌడ్ లను ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
గ్రామ వాట్సాప్ గ్రూప్ లో ఫోటోలు పెట్టవద్దనందుకే వారిని చంపినట్లు పోలీసు విచారణలో తేలింది. చనిపోయినవారు గోపగోని శివ, శేషగిరి శివ అనే యువకులు కడ్తాల మండలంలోని గోవిందాయ పల్లి గ్రామస్తులు. వారిరువురు, అదే గ్రామానికి చెందిన నిందితుడు రవి ఒకే రాజకీయ పార్టీలో పని ఉండేవారు. గ్రామ స్థాయిలో వీరు పార్టీ పనులు చేసేవారు. నేరస్తుడు రవితో విభేదాలు వచ్చి గోపగోని శివ, శేషగిరి శివ వేరే పార్టీలో చేరారు.
రవి పుట్టినరోజు సందర్భంగా కడ్తాల పరిధిలోని బటర్ ఫ్లై వెంచర్ లో విల్లాను అద్దకు తీసుకొని వేడుకలను ఘనంగా చేశారు. ఆ బర్త్ డే పార్టీకి సంబంధించిన 200 ఫొటోలు గ్రామ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశారు. గోపగోని శివ, శేషగిరి శివ లు అలాంటి ఫొటోలు గ్రూప్ లో పెట్టొదని రవిని మందలించారు. గ్రూప్ లో ఫోటోలను డిలీట్ చేసి రవిని వాట్సాప్ గ్రూప్ నుంచి రిమూవ్ చేశారు. అప్పటి నుంచి రవి వారిపై కక్ష్య పెంచుకున్నాడు.
ఫొటోలు ఎందుకు డిలీట్ చేశారని రవి వారితో గొడవ పడ్డాడు. దీంతో గోపగోని శివ, శేషగిరి శివలను ఎలాగైనా చంపేయాలని రవి ఫిక్స్ అయ్యాడు. హైదరాబాద్ గాయత్రి నగర్ చౌరస్తాలో వారు ఉండే ఇంటి అడ్రస్ కనుక్కోని బలవంతంగా గోపగోని శివ, శేషగిరి శివ లను కారులో ఎక్కించుకొచ్చారు. రవి స్నేహితుల సహాయంతో జూన్ 4న రవి బర్త్ డే వేడుకలు చేసుకున్న అదే విల్లాకు తీసుకువచ్చి అత్యంత కిరాతంగా కత్తులతో పొడిచి చంపారు.