ఐటీ కారిడార్​ కేంద్రంగా గంజాయి దందా

ఐటీ కారిడార్​ కేంద్రంగా గంజాయి దందా
  • ఐటీ ఉద్యోగులు, ఇంజినీరింగ్​ స్టూడెంట్స్​కు అమ్మకాలు 
  • నిందితుల అరెస్ట్..గంజాయి స్వాధీనం

గచ్చిబౌలి, వెలుగు :  ఐటీ కారిడార్ కేంద్రంగా ఐటీ ఉద్యోగులకు, ఇంజినీరింగ్ విద్యార్థులకు గంజాయి అమ్ముతున్న ముగ్గురిని  శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.  హఫీజ్​ పేట్​కి చెందిన ఆసిఫ్​ షేక్ ఆటో  నడుపుతూ..  బీదర్ నుంచి గంజాయి తీసుకువచ్చి ఐటీ కారిడార్ లోని నానక్​రామ్​ గూడా,  గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, హఫీజ్ పేట్​ ఏరియా ల్లో  అమ్ముతున్నాడు.  శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చందానగర్ వద్ద ఆటోలో వెళ్తున్న షేక్ ఆసిఫ్ ని  పట్టుకొని  1.5 కిలోల గంజాయి, రూ.7200   నగదు, ఆటో, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని శేరిలింగంపల్లి ఎక్సైజ్​ పోలీసులకు అప్పగించారు.  

మరో ఇద్దరు.. 

ఐటీ ఉద్యోగులు, ఇంజనీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా గంజాయి అమ్ముతున్న ఇద్దరిని శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బోరబండకు  చెందిన రమేశ్​, వెంకటేశ్​ మాదాపూర్ సిద్దిక్ నగర్ లో ఉంటూ మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్​రాంగూడ ఏరియాల్లో ఐటీ ఉద్యోగులకు, ఇంజినీరింగ్ స్టూడెంట్స్​కు గంజాయి, హాష్ ఆయిల్ అమ్ముతున్నారు.   శంషాబాద్ ఎక్సైజ్​ టాస్క్ ఫోర్స్ పోలీసులు  రమేశ్​, వెంకటేశ్​ ను పట్టుకొని,  830 గ్రాముల గంజాయి, 14 గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.  బైక్, రెండు సెల్ ఫోన్లు  స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు.  

 మలక్​పేటలో 62 కిలోల గంజాయి..  

మలక్ పేట:  ఒడిసా సరిహద్దు ప్రాంతాల నుంచి తెలంగాణ, మహారాష్ట్రలకు గాంజా సరఫరా చేస్తున్న  ఎంపీకి చెందిన  రాజు జాట్ (35) ను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్​, చాదర్ ఘాట్ పోలీసులు పట్టుకొని  రిమాండ్ కు తరలించారు. రూ.15 లక్షల 50 వేల విలువైన 62 కిలోల  గాంజా, మొబైల్ ఫోన్ స్వాధీనం  చేసుకున్నారు.  వివరాలను సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ పాటిల్ కాంతిలాల్ ..సైదాబాద్  పీఎస్​లో వెల్లడించారు. రాజు  ఐదేండ్లుగా గంజాయి స్మగ్లింగ్  చేస్తున్నాడని,  ఐస్ క్రీం వ్యాపారం చేస్తూ గంజాయి అమ్మేవాడని తెలిపారు.  ఒడిసాకు  చెందిన  సుభాష్  నుంచి  తక్కువ ధరకు గంజాయి కొని   సిటీకి తెచ్చి,  మహారాష్ట్రకు తరలిస్తున్న క్రమంలో నల్గొండ చౌరస్తా వద్ద   పట్టుకున్నామన్నారు.  రూ. 15లక్షల 50వేల   విలువైన 62 కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 

7.84 కేజీల గంజాయి పట్టివేత

హైదరాబాద్​సిటీ :  నగరంలోని పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న వారిని ఎక్సైజ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ పోలీసులు అదుపులోకి తీసుకుని  7.84 కేజీల గంజాయి, 14 గ్రాముల హాష్​ ఆయిల్​ స్వాధీనం చేసుకున్నారు.   చర్లపల్లి– రాంపల్లి రోడ్ లో  హరికృష్ణ    నుంచి 4 కిలోలు,   ఓయూ ఆర్ట్స్ కాలేజ్ రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో  1.3  కిలోల గంజాయి, మాదాపూర్ సిద్ధి  వినాయక నగర్ ప్రాంతంలో  14  గ్రాముల హాల్​ ఆయిల్​ పట్టుకున్నారు.