210 కిలోల గంజాయి సీజ్

210 కిలోల గంజాయి సీజ్

జీడిమెట్ల, వెలుగు:  కారులో  భారీగా గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని శంషాబాద్ ఎస్​వోటీ, మేడ్చల్ పోలీసులు పట్టుకున్నారు.  పేట్ బషీరాబాద్​లో జరిగిన మీడియా సమావేశంలో మేడ్చల్ డీసీపీ  సందీప్ ఈ మేరకు వివరాలను  వెల్లడించారు. ఒడిశాలోని బరంపురానికి చెందిన సీతారామ్, నల్గొండ బొల్లారం తండాకి చెందిన రమావత్ మత్రు నాయక్, మహారాష్ట్రకి చెందిన శివ  కొంతకాలంగా  గంజాయిని తరలిస్తున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకి  గంజాయిని తరలిస్తున్నారు. బరంపురంలో గంజాయి పండిస్తున్నవారి నుంచి  సీతారామ్ గంజాయి సేకరించి  వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తుంటాడు.  

ALSOREAD:హరిబౌలి రోడ్డు వెడల్పునకు..కొత్త నోటిఫికేషన్ ఎందుకివ్వలే

సీతారామ్ పంపిస్తున్న గంజాయిని మత్రు నాయక్ అవసరమైనవారికి విక్రయిస్తాడు. నాయక్​ అదేశాల మేరకు నల్గొండ,  చందంపేట్ గట్టు తండాకు  చెందిన  డ్రైవర్  జారూపుల  తిరుపతి (20)   వివిధ  రాష్ట్రాలకు గంజాయిని సరఫరా చేస్తుంటాడు.  ఈ క్రమంలో  మత్రునాయక్  ఒడిశాలో  సీతారామ్​ వద్ద నుంచి  210 కేజీల గంజాయి తీసుకువచ్చి మహారాష్ట్రలోని  శివకి అందజేయాలని చెప్పాడు.  దీంతో  అతడు ఒక్కోటి  2 కిలోల  చొప్పున 105 ప్యాకెట్లలో 210 కిలోలు గంజాయి తీసుకుని  ఒడిశా  బరంపురం నుంచి నగరం  మీదుగా మహారాష్ట్రకి బయలుదేరాడు.  పోలీసుల నుంచి తప్పించుకోవడానికి టోల్ గేట్ల మీదుగా కాకుండా అడ్డదారుల్లో  వెళ్తుండగా సమాచారం మేరకు  శంషాబాద్ ఎస్ వోటీ, మేడ్చల్  పోలీసులు  మేడ్చల్ చెక్ పోస్టు వద్ద కియా కారును తనిఖీ చేశారు.  కారులో ఉన్న రూ.60లక్షల విలువచేసే 210 కేజీల గంజాయితోపాటు,  కియా కారు, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.  సప్లయర్ సీతారామ్, రమావత్  మత్రు నాయక్, శివ పరారీలో ఉన్నట్లు  డీసీపీ తెలిపారు.