కొత్త రూటులో షంషేర్‌గంజ్, జంగమెట్ మెట్రో స్టేషన్లు లేవు..

హైదరాబాద్:  సిటీలో పెరిగిన ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్తు రవాణా అవసరాల దృష్ట్యా హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 విస్తరణ చేపడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కువ మంది ప్రయాణికులకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండేలా, నగరం నలుమూలాల నుంచి ఎయిర్ పోర్టుకు కనెక్టివిటీ ఉండేలా సీఎం రేవంత్ రడ్డి సూచనల మేరకు కొత్త రూట్లను అధికారులు రూపొందించారు. మొత్తం ఏడు కారిడార్ లో మెట్రో ఫేజ్–2 విస్తరణను చేపడుతున్నారు అధికారులు. ఇందులో ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్ నుమా వరకు ఓల్డ్ సిటీ మెట్రో లైన్‌ 5.5 కిలోమీటర్ల కారిడార్ 2-ను నిర్మించేందుకు అధికారులు ఇప్పటికే రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు. అయితే, తాజాగా ఓల్డ్ సిటీ మెట్రో లైన్‌ రూట్ లో స్వల్ప మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సమాచారం ప్రకారం.. సాలార్జంగ్, చార్మినార్, షా అలీ బండా, ఫలక్‌నుమా అనే నాలుగు కొత్త స్టేషన్లు మాత్రమే నిర్మించనున్నారు. మొదట ప్లాన్ ప్రకారం.. షంషేర్‌గంజ్, జంగమెట్ లతో సహా మొత్తం ఆరు స్టేషన్‌లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు.. అసలు లేఅవుట్ ప్రకారం రోడ్డు వంపులో పడిపోవడం వల్ల నిర్మాణంలో సంక్లిష్టత పెరిగి సర్వీస్ వేగాన్ని తగ్గించే అవకాశం ఉన్నందున షంషేర్‌గంజ్ స్టేషన్‌ను తాజా ప్లాన్ నుండి తొలగించినట్లు తెలిసింది. కొత్త ప్లాన్, స్టేషన్ నష్టాన్ని భర్తీ చేయడానికి, షా అలీ బండాను షంషేర్‌గంజ్‌కి కొద్దిగా దగ్గరగా రెండు స్థానాలకు చేరవేస్తుంది. జంగమెట్ స్టేషన్ విషయానికొస్తే, ఫలక్‌నుమా స్టేషన్‌కు సమీపంలో ఉన్నందున.. దీన్ని అవసరం పెద్దగా ఉండదని భావించిన అధికారులు.. ప్లాన్ నుంచి ఈ స్టేషన్ ను తొలగించారు. 

Also Read :సీఎం రేవంత్ రెడ్డిని ఎదురుకునే దమ్ము కేసీఆర్కు లేదు

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి మాట్లాడుతూ.. " గత అనుభవాల నుంచి.. అనేక స్టేషన్‌లు సమీపంలో ఉండటం వల్ల ఎల్లప్పుడూ పని చేయవని మేము గ్రహించాము. 5.5-కిమీల విస్తీర్ణంలో, ఎమ్‌జిబిఎస్‌తో సహా ఐదు స్టేషన్లు ఉంటాయి. ఇది సరైన ప్లాన్" అని తెలిపారు.  కాగా, మార్చి 8న హైదరాబాద్ మెట్రో ఫేజ్–2  పనులకు శంకుస్థాపన చేయనున్నారు.