ENG v PAK 2024: షాన్ మసూద్ సెంచరీ.. ఇంగ్లాండ్ బౌలర్లను దంచి కొడుతున్న పాక్

ముల్తాన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ అదరగొడుతుంది. తొలి రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ పై పూర్తి ఆధిపత్యం చూపిస్తుంది. సొంతగడ్డపై సత్తా చాటుతూ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. మొదట బ్యాటింగ్ చేస్తున్న పాకిస్థాన్ ప్రస్తుతం వికెట్ నష్టానికి 184 పరుగులు చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ సెంచరీ (104*: 10 ఫోర్లు, 2 సిక్సులు)తో అజేయంగా క్రీజ్ లో ఉన్నాడు. అతనికి ఓపెనర్ అబ్దుల్ షఫీక్ (72*) చక్కని సహకారం అందిస్తున్నాడు. 

బంగ్లాదేశ్ పై రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను 0-2 తేడాతో చేజార్చుకున్న పాకిస్థాన్ తీవ్ర విమర్శలకు గురవుతుంది. ముఖ్యంగా సొంతగడ్డపై బంగ్లా లాంటి ఓడిపోవడం ఆ దేశ అభిమానాలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో మాత్రం చక్కగా రాణిస్తుంది. ఓపెనర్ సైమ్ అయూబ్ 4 పరుగులే చేసి ఔటైనా.. షాన్ మసూద్, షఫీక్ భాగస్వామ్యంతో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. వీరిద్దరూ రెండో వికెట్ కు అజేయంగా 176 పరుగులు జోడించడం విశేషం.   

ALSO READ | CPL 2024: సెయింట్ లూసియా కింగ్స్‌కు ట్రోఫీ.. రోహిత్ దారిలో డుప్లెసిస్

ఇంగ్లాండ్ బౌలర్లను ఈ జోడీ అలవోకగా ఆడేస్తున్నారు. ఓ వైపు షఫీక్ డిఫెన్స్ కు పరిమితం కాగా.. మరో ఎండ్ లో మసూద్ వేగంగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 5 వ సెంచరీని సాధించాడు. షఫీక్ సైతం సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో అట్కిన్సన్ కు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ ద్వారా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్సే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. బెన్ స్టోక్స్ నుంచి అతను క్యాప్ ను అందుకున్నాడు.