T20 Blast 2024: అదృష్టం అంటే ఇతనిదే: రెండుసార్లు ఔటైనా తప్పించుకున్న పాక్ బ్యాటర్

T20 Blast 2024: అదృష్టం అంటే ఇతనిదే: రెండుసార్లు ఔటైనా తప్పించుకున్న పాక్ బ్యాటర్

క్రికెట్ లో కొన్నిసార్లు అద్భుతాలు జరగడం కామన్. అయితే ఎప్పుడూ జరగని వింత జరిగితే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు. ఒకసారి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించున్న ఆటగాళ్లను చూసాం గాని ఒకే బంతికి రెండుసార్లు ఔటైనా.. అతను నాటౌట్ అవుతాడని ఎవరైనా ఊహించగలరా..? టీ20 బ్లాస్ట్ లో ఇలాంటి సంఘటన షాక్ కు గురి చేస్తుంది. పాకిస్థాన్ బ్యాటర్ షాన్ మసూద్ ఒకే బంతికి హిట్ వికెట్, రనౌటైనా ఔటయ్యే ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు బయటపడ్డాడు. 

ఇంగ్లాండ్ లో ప్రస్తుతం టీ20 బ్లాస్ట్ జరుగుతుంది. ఇందులో భాగంగా యార్క్‌షైర్, లాంక్‌షైర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఊహించని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 15 ఓవర్లో లంకాషైర్‌ బౌలర్ జాక్ బ్లాథర్‌విక్ వేసిన బంతిని యార్క్‌షైర్ బ్యాటర్ షాన్ మసూద్ స్కూప్ షాట్ కు ప్రయత్నించాడు. షాట్ ఆడడంలో విఫలమైన అతను అదే సమయంలో నియంత్రణ కోల్పోవడంతో కాలు వికెట్లను తగిలింది. దీంతో మసూద్ హిట్ వికెట్ అయ్యాడు. అయితే అది నో బాల్ కావడంతో మసూద్ ఔట్ నుంచి బయటపడ్డాడు. 

ఈ సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న రూట్ పరుగు కోసం కాల్ ఇచ్చాడు. అప్పటికే పిచ్ సగానికే చేరుకున్న మసూద్ రనౌటయ్యాడు. ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో ఈ బాల్ ను అంపైర్ డెడ్ బాల్ గా ప్రకటించాడు. సాధారణంగా నో బాల్ లో రనౌట్ ఉంటుంది. MCC రూల్ 31.7 ప్రకారం ఒక బ్యాటర్ పొరపాటున తాము అవుట్ అయ్యామని వికెట్ వదిలేస్తే.. ఆ బ్యాటర్ అంపైర్ కు డెడ్ బాల్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ రూల్ మసూద్ ను కాపాడింది. ఇక ఈ మ్యాచ్ లో లాంక్‌షైర్ పై యార్క్‌షైర్ విజయం సాధించింది.