IPL 2024: అభిమానులకు క్షమాపణలు.. RCB కప్ కొట్టకపోవడానికి నేనే కారణం: వాట్సన్

IPL 2024: అభిమానులకు క్షమాపణలు.. RCB కప్ కొట్టకపోవడానికి నేనే కారణం: వాట్సన్

ఐపీఎల్ లో అన్ లక్కీ జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు పేరుంది. ఆటగాళ్లను మార్చినా.. కెప్టెన్లను మార్చినా.. ఆఖరికి ఆ జట్టు కోచ్ ను మార్చినా.. ఫలితం మాత్రం మారడం లేదు. 16 సీజన్ లుగా టైటిల్ అందని ద్రాక్షాగానే మిగిలిపోయింది. ఈ క్రమంలో మూడు సార్లు ఫైనల్ కు వచ్చినా ట్రోఫీ గెలవలేకపోయింది. ముఖ్యంగా 2016 ఐపీఎల్ ఫైనల్లో విజయం అంచు వరకు వచ్చి ఓడిపోయింది. ఈ ఓటమి గురించి తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ వాట్సన్ చర్చించాడు. అప్పట్లో ఆర్సీబీ జట్టు తరపున ఆడుతున్న షేన్ వాట్సన్ తన వల్లే జట్టు ఓడిపోయిందని పరోక్షంగా వ్యాఖ్యానించాడు.

"ఇక్కడ ఉన్న RCB అభిమానులందరికీ నేను క్షమాపణలు చెప్పాలి. దానికి కారణం చిన్నస్వామి స్టేడియంలో 2016 IPL ఫైనల్‌ నా కారణంగా ఓడిపోవడమే. ఫైనల్ కు ముందు నేను బాగా సిద్ధమయ్యాను. జట్టు కోసం గొప్ప ప్రదర్శన ఇవ్వాలని ఆశించాను. కానీ అలా జరగలేదు. ఫైనల్‌లో చెత్త బౌలింగ్ తో ఆర్సీబీ ఓడిపోవడానికి కారణమయ్యాను". అని వాట్సన్ బెంగళూరులోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో చెప్పుకొచ్చాడు. ఇదివరకు జియో సినిమాతో మాట్లాడిన వాట్సన్ ఇదే విషయంపై మాట్లాడుతూ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పాడు.   

2016లో సన్ రైజర్స్ తో జరిగిన ఫైనల్లో బెంగళూరు ఓడిపోవడానికి వాట్సన్ కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆసీస్ ఆల్ రౌండర్ బ్యాటింగ్ బౌలింగ్ లో దారుణంగా విఫలమయ్యాడు. మొదట బౌలింగ్ లో 4 ఓవర్లలో 61 పరుగులు సమర్పించుకున్నాడు. బ్యాటింగ్ లో 9 బంతుల్లో ఒక సిక్సర్ తో 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కోహ్లీ, గేల్ తొలి వికెట్ కు 114 పరుగుల భారీ భాగస్వామ్యం అందించినా..మిగిలిన వారు విఫలం కావడంతో బెంగళూరు 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. ప్రస్తుత సీజన్ లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. రాజస్థాన్ రాయల్స్ తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉంది.