
ప్రస్తుత సమాజంలో విద్య, వైద్యాన్ని వ్యాపారం చేసి డబ్బులు దండుకోవడం పరిపాటి అయ్యింది. ప్రాణాలు కాపాడే దేవుళ్లుగా చూసే డాక్టర్లు.. అసలు డాక్టర్లే కాదని తెలిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి. ఎలాంటి మెడిసిన్ కోర్సులు చదవకుండా డాక్టర్లుగా చలామణి అయితే వారిని ఏమనాలి. అప్పట్లో వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలోనైనా ఫ్రాడ్ చేసి పరీక్ష రాసేందుకైనా ప్రయత్నిస్తారు. కానీ వీళ్లు ఏ పరీక్ష రాయకుండా డబ్బులు కొట్టటి ఉత్తుత్తి సంతకాలతో సర్టిఫికేట్లు తయారు చేసి డాక్టర్లు అయిపోయారు. గురువారం (ఏప్రిల్ 24) వైద్య అధికారులు నిర్వహించిన సోదాల్లో ఫేక్ డాక్టర్ల బాగోతం బయటపడింది.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఆకస్మిక తనిఖీ నిర్వహించడంతో ఫేక్ సర్టిఫికేట్లతో డాక్టర్లుగా, ల్యాబ్ అసిస్టెంట్లుగా చలామణి అవుతున్న సిబ్బంది బాగోతం బయట పడింది. గురువారం పలు ప్రైవేట్ హాస్పిటల్స్ ,స్కానింగ్ సెంటర్లు పై టీజీఎంసి దాడులు నిర్వహించారు అధికారులు. అర్హత లేకుండానే ఒక వ్యక్తి 15ఏండ్లుగా రేడియాలజిస్ట్ గా చలామణి అవుతున్నట్లు తెలిసి షాక్ కు గురయ్యారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అర్హత లేని టెక్నీషియన్ ను డిఎంహెచ్ఓ కోటాచలం రెన్యూవల్ సైతం చేయడం చూసి అధికారులు విస్మయానికి గురయ్యారు. ఎటువంటి సర్టిఫికెట్ చూడకుండా గుడ్డిగా రెన్యూవల్ చేసినట్లు అధికారులు నిర్ధారించారు. అదేవిధంగా ఫోర్జరీ సర్టిఫికేట్ తో మరో డాక్టర్ చలామణి అవుతున్నట్లు గుర్తించారు. సూర్యాపేట జిల్లాలో వైద్య శాఖ పై అనేక ఆరోపణలు వస్తున్న క్రమంలో తనిఖీలు నిర్వహించారు.