న్యూఢిల్లీ/బెంగళూరు : ఎయిర్ ఇండియా విమానంలో మద్యం మత్తులో 70 ఏండ్ల పెద్దావిడపై యూరిన్ పాస్ చేసిన శంకర్ మిశ్రా(34)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజులుగా పరారీలో ఉన్న నిందితుడిని ఢిల్లీ పోలీసులు శనివారం బెంగళూరులో అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేయగా 14 రోజుల రిమాండ్ విధించింది. కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల విజ్ఞప్తిని ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఎయిర్ ఇండియాకు మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు ఈ నెల 4న ముంబైకి చెందిన మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 294, 354, 509, 510 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటన బయటపడినప్పటి నుంచి మిశ్రా కనిపించకుండా పోవడంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి గాలింపు చేపట్టారు.
ఫోన్ స్విచాఫ్ చేసి బెంగళూరులోని సోదరి ఇంట్లో ఉంటున్నాడని, క్రెడిట్ కార్డు వినియోగాన్ని బట్టి ఆచూకీ తెలుసుకుని పట్టుకున్నామని తెలిపారు. నిందితుడు అమెరికాకు చెందిన వెల్స్ఫార్గో కంపెనీ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు. ఈ ఘటన నేపథ్యంలో కంపెనీ అతడిని ఉద్యోగంలోంచి తొలగించింది.