దొంగ..మంచి దొంగ..కిలాడీ దొంగ..దొంగోళ్లకే దొంగోడు..దొంగల్లో మంచి దొంగ..ఇవన్నీ సినిమా డైలాగ్స్ కావొచ్చు..వీడు మాత్రం అసలు సిసలు మంచి దొంగ అనటంలో సందేహం లేదు..దొంగను మంచి దొంగ అంటారేంటీ అంటారా.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
మహబూబ్ నగర్ కు చెందిన శంకర్ నాయక్ ఇటీవల హబ్సీగూడలో వరుస దొంగతనాలు చేసి ఓయూ పోలీసులకు చిక్కాడు. అతన్ని విచారిస్తే పోలీసులు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఈ వింత దొంగ శంకర్ నాయక్.. ఎదైనా ఇంట్లో చోరీ చేశాడంటే.. ఆ ఇంటినుంచి ఎంత ఎత్తుకెళ్లాడు.. ఏమేం ఎత్తుకెళ్లాడు.. ఇలా వివరాలన్నీ ఓ చీటీలో రాసి పెట్టి మరీ చోరీ చేస్తున్నాడు. ఇలా ఎందుకు చేస్తున్నావంటే.. తనపై తప్పుడు ఫిర్యాదు ఇవ్వకుండా ఇలా చేస్తానని పోలీసులు చెప్పాడు.
దొంగిలించిన సొమ్మును ముత్తూట్ గోల్డ్ లోన్ లో తాకట్టు పెట్టి పెద్ద హోటల్స్ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు శంకర్ నాయక్. మిగిలిన డబ్బులో మళ్లీ దొంగతనం చేసేందుకు బైక్ లు కొనుగోలు చేస్తాడట. ఆ బైక్ లతో మళ్లీ దొంగతనం చేసేందుకు వెళ్తాడట ఈ వెరైటీ దొంగ శంకర్ నాయక్. ఇప్పటివరకు తాను ఎంత దోచుకున్నది.. డైరీలో రాసుకుంటాడట. చోరీ కి వెళ్లిన ఇంట్లో ఏం ఎత్తుకెళ్లాడు అనే అన్ని వివరాలు చీటీలో రాసి ఉంచి వెళతాడట. ఇప్పటివరకు శంకర్ నాయక్ పై 94 దొంగతనం కేసులు నమోదు అయ్యాయని పోలీసులు చెబుతున్నారు.
ఈ వెరైటీ దొంగ శంకర్ నాయక్ పై మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పీడీ యాక్ట్ కేసు కూడా నమోదు అయింది. ఐనా దొంగ బుద్ది మాత్రం మారలేదు. ఇటీవల హబ్సిగూడ పరిధిలో మూడు దొంగతనాలు చేసి ఓయూ పోలీసులకు చిక్కాడు. శంకర్ నాయక్ నుంచి 20 తులాల బంగారం, 2 బైక్స్, 3 మొబైల్ ఫోన్స్, డైరీ, చోరీకి ఉపయోగించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.