- ఆర్అండ్ఆర్ కాలనీలో సౌలతులు కల్పించని ఆఫీసర్లు
- పూర్తి సాయం అందించకుండా ఇబ్బంది పెడుతున్నరని బాధితుల ఆవేదన
వనపర్తి, వెలుగు : సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితుల సమస్యలు పరిష్కరించి వారికి పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వర్షాకాలంలో పాత ఇండ్లలో పిల్లలు, వృద్ధులతో బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలోని కానాయపల్లిలో నిర్మించిన శంకరసముద్రం రిజర్వాయర్ లో 1,134 కుటుంబాలు ఇండ్లు, ఆస్తులు కోల్పోయాయి. వనపర్తి నియోజకవర్గంలోని శ్రీరంగాపురంలోని రంగసముద్రం రిజర్వాయర్ లో నాగరాల గ్రామం పూర్తిగా నీట మునిగింది. దీంతో గ్రామస్తులు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.
2006లో వీరికి ఆర్అండ్ఆర్ కింద పునరావాసం కల్పించే పనులు మొదలుపెట్టినా, ఇప్పటివరకు వీరికి రావాల్సిన మొత్తం బెనిఫిట్స్ అందించలేదు. కానాయపల్లి గ్రామాన్ని ఖాళీ చేయించి శంకర సముద్రం రిజర్వాయర్ ను నీటితో నింపాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే తమకు రావాల్సిన పరిహారం నయా పైసలతో సహా చెల్లిస్తేనే గ్రామం వదిలి వెళతామని కానాయపల్లి నిర్వాసితులు పట్టుబడుతున్నారు. అప్పటి నుంచి పాత ఇండ్లలోనే ఉంటున్నారు. వదిలి వేయాల్సిన ఇండ్లకు రిపేర్లు ఎందుకని అలాగే కాలం వెళ్లదీస్తున్నారు.
‘ఏదుల’ బాధలూ తీరలే..
పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్‌లో భాగంగా వనపర్తి జిల్లాలోని రేవల్లి మండలం బండరావిపాకుల, కొంకలపల్లి గ్రామాల్లో ఏదుల రిజర్వాయర్ నిర్మించారు. ప్రభుత్వం భూములకు పరిహారం చెల్లించినప్పటికీ 18 ఏండ్లు నిండిన వారిని ఇండ్లు కేటాయించాలని ఆందోళన చేపట్టారు. ఆర్అండ్ఆర్ సెంటర్ లో సౌలతులు లేకపోవడంతో ఆయా గ్రామాల్లోని గ్రామ పంచాయతీ, కమ్యూనిటీ హాళ్లలో తల దాచుకుంటున్నారు. ప్రభుత్వం రూ.680 కోట్లతో ఏదుల రిజర్వాయర్ ను చేపట్టి పనులు పూర్తి చేసింది. ఈ వానాకాలం కృష్ణానదికి వచ్చే వరదలతో లో రిజర్వాయర్ ను నింపే ఆలోచనలో ఉంది. రిజర్వాయర్ కింద బండరాయిపాకులలో 978 కుటుంబాలు, కొంకలపల్లిలో 321 కుటుంబాలు ఆస్తులు కోల్పోయాయి.
తమ ఖాళీ జాగలకు డబ్బులు ఇవ్వలేదని నిర్వాసితులు వాపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో కొన్ని కుటుంబాలు గ్రామ పంచాయతీ ఆఫీస్‌లో తలదాచుకుంటున్నాయి. తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో 40 కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్అండ్ఆర్ కాలనీలో కరెంట్, తాగునీటి సౌలత్ లేక ఇబ్బందులు పడుతున్నారు. వీరు తల దాచుకుంటున్న బండరాయిపాకులలోని గవర్నమెంట్, స్కూల్ బిల్డింగ్ కూడా శిథిలావస్థకు చేరుకుంది.
అప్పు తెచ్చి ఇల్లు కట్టిన..
కోల్పోయిన భూములు, ఇండ్లు, ఆస్తులకు ప్రభుత్వం చెల్లించిన పరిహారం డబ్బులు ఇల్లు కట్టుకోవడానికి కూడా సరిపోలేదు. ఖాళీ స్థలాలకు పరిహారం ఇప్పటికి ఇయ్యలే. పైసలు సరిపోక అప్పు తెచ్చి ఇల్లు కట్టుకున్నాను. నా కూతురు పెళ్లి చేయడానికి మళ్లీ అప్పు చేయాలి. చాలీచాలని పరిహారం ఇచ్చి సర్కారు ఇప్పటికీ మమ్మల్ని సతాయిస్తోంది.
- తలారి నాగయ్య, బండరాయిపాకుల
90శాతం డబ్బులు ఇచ్చాం
ఏదుల రిజర్వాయర్ ముంపు గ్రామాలైన బండరాయిపాకుల, కొంకలపల్లిలో 1,299 కుటుంబాలకు రూ.210 కోట్లకు గాను రూ.206 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. మిగతా డబ్బులు త్వరలోనే చెల్లించేందుకు మంత్రి నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు. 18 ఏండ్లు నిండిన వారికి ప్లాట్లు ఇవ్వాలని, ఖాళీ జాగల డబ్బులు మంజూరు చేయాలని ప్రపోజల్స్ పంపించాం. ఆర్అండ్ఆర్ కాలనీలో సౌలతులు కల్పిస్తాం.
- సత్యనారాయణ , డీఈ, ఏదుల రిజర్వాయర్