శంకర్ దాదా ఎంబీబీఎస్​లు! ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫేక్‍ డాక్టర్ల దందా

  • ట్రీట్‍మెంట్‍.. లేదంటే కమీషన్ ఇచ్చే డాక్టర్  వద్దకు రెఫర్  
  • పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న క్లినిక్స్, ల్యాబ్స్
  • శాంపిల్ తీసుకుని టెస్టులు చేయకుండానే  రిపోర్టులు 
  • మెడికల్‍ టాస్క్ ఫోర్స్ దాడుల్లో పట్టుబడుతున్న వైనం 
  • గడిచిన ఆరు నెలల్లోనే పలు ఘటనల్లో 65 కేసులు

వరంగల్‍, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో శంకర్‍దాదా ఎంబీబీఎస్‍ లు ఎక్కువవుతున్నారు. డాక్టర్‍ గా చెలామణి అవుతూ మెడికల్ దందాకు పాల్పడుతున్నారు. ఎలాంటి లైసెన్స్ లు లేకుండానే గల్లీల్లో బోర్డులు పెట్టుకుని హాస్పిటల్స్, క్లినిక్స్ ఓపెన్‍ చేస్తున్నారు.

 పేషెంట్లకు ఇష్టానుసారంగా ట్రీట్ మెంట్ చేస్తూ ప్రాణాలు తీసేస్తున్నారు. ఫిజియోథెరపిస్టులు మొదలు ఆర్ఎంపీ, పీఎంపీలతో పాటు సీనియర్ డాక్టర్ల వద్ద పని చేసే కాంపౌండర్లు సైతం డాక్టర్లుగా చెప్పుకుంటున్నారు. అనారోగ్య సమస్యలతో వచ్చే పేషెంట్లకు స్టెరాయిడ్స్, యాంటీ బయెటిక్ మెడిసిన్ ఇస్తున్నారు. 

ఆపై రూ. వేలల్లో ఉండే మెడికల్ టెస్ట్ లను వంద, రెండొందలకే చేస్తూ తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారు. వాటిని నమ్ముకుంటున్న జనాలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.  ఎమర్జెన్సీ సమయాల్లో పేషెంట్‍ వస్తే వీలైతే ట్రీట్‍మెంట్‍.. 

లేదంటే అధిక కమీషన్‍ ఇచ్చే డాక్టర్‍ వద్దకు రెఫర్ చేస్తున్నారు. ఏకంగా అసోసియేషన్లు ఏర్పాటు చేసుకుని ఆస్పత్రులు, డాక్టర్ల వద్ద పెద్ద మొత్తంలో కమీషన్‍ తీసుకుంటున్నారు.  టీజీఎంసీ (తెలంగాణ మెడికల్‍ కౌన్సిల్‍) ఆధ్వర్యంలో మెడికల్‍ టాస్క్ ఫోర్స్ టీమ్ చేస్తున్న దాడుల్లో ఫేక్ డాక్టర్ల దందా గుట్టు బట్టబయలు అవుతోంది. 

 కొన్ని ఘటనలు ఇలా..

వరంగల్‍ జిల్లా వర్ధన్నపేటలో 22 ఏండ్ల  ఆటో డ్రైవర్‍కు ఫేక్ డాక్టర్ ట్రీట్‍మెంట్‍ పేరుతో గంటలోపు  7 ఇంజక్షన్లు చేశాడు. దీంతో కండీషన్‍ సీరియస్‍ అయి బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్‍ సిటీలోని ఇంతేజార్ గంజ్ ఏరియాలో ఓ ఫేక్ డాక్టర్ పేషెంట్‍కు ఆపరేషన్‍ చేస్తుండగా ఫెయిలై పేషెంట్ మరణించాడు. వరంగల్‍ జిల్లా చెన్నారావుపేట మండలం బోజెరువుకు చెందిన 40 ఏండ్ల మహిళ ఫిట్స్ వ్యాధితో బాధ పడుతుండగా డాక్టర్ వద్ద పనిచేసే మహిళ రూ.3 వేలు తీసుకుని హెర్బల్‍ మందులు ఇచ్చింది.

వాటిని వేసుకోగా బాధితురాలి కిడ్నీ, లివర్‍ దెబ్బతిని ఎంజీఎంలో ట్రీట్‍మెంట్‍ పొందుతూ చనిపోయింది. ములుగు జిల్లాలో 24 ఏండ్ల ఓ మహిళకు అబార్షన్ల టాబ్లెట్స్ ఇచ్చి చికిత్స చేయగా.. రక్తస్రావం జరిగి మరణించింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలానికి ఓ మహిళకు ఫేక్ డాక్టర్ చేసిన ట్రీట్ మెంట్ కారణంగ ఇన్‍ఫెక్షన్‍ సోకి చెయ్యి మొత్తం నల్లగా మారింది. ఆపై బాధితురాలి చేతిని తొలగించాల్సి వచ్చింది. ఇవన్నీ గత ఆరునెలల కాలంలోనే జరిగాయి.  

టీజీఎంసీ దాడుల్లో 65 కేసులు 

ఉమ్మడి జిల్లాలో ఫేక్‍ మెడికల్‍ దందా రోజురోజుకూ పెరుగుతుండడంతో తెలంగాణ మెడికల్‍ కౌన్సిల్‍ (టీజీఎంసీ) ఆధ్వర్యంలో మెడికల్‍ టాస్క్ ఫోర్స్ టీమ్ ఇటీవల కాలంలో  దాడులు తీవ్రం చేసింది.  ఫేక్ హాస్పిట ల్స్, క్లినిక్స్, డాక్టర్లు ఉండేచోట దాడులు కొనసాగిస్తోంది. దాడులు, ఫిర్యాదుల ఆధారంగా టీజీఎంసీ టీమ్ చేసిన రైడ్‍ లో  ఇప్పటివరకు 65 కేసులు నమోదు అయ్యాయి. ఫేక్ డాక్టర్ల కారణంగా గత ఆరేడు నెలల్లోనే 10 మందికిపైగా మరణించినట్లు తెలిసింది. 

ఫేక్‍ డాక్టర్లపై కేసులు పెడ్తం 

ఉమ్మడి వరంగల్‍ జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో ఫేక్ డాక్టర్లు ఫేక్‍ మెడికల్‍ దందా నిర్వహిస్తున్నారు. కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలు ఇష్టారీతిన డాక్టర్‍ బోర్డులు పెట్టుకుని తెలియని వైద్యం చేస్తూ పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 

కాంపౌండర్లు కూడా ఫేక్ సర్టిఫికెట్లతో ఫేక్ డాక్టర్లుగా మారుతున్నారు. డయాగ్నోస్టిక్‍, ల్యాబ్‍ల పేరుతో ఆఫర్లు ప్రకటించి తప్పుడు రిపోర్టులు చేతిలో పెడ్తున్నట్లు మాకు నోటీస్‍కు వచ్చింది. అలాంటి దందా చేసేవారిపై ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. నేషనల్‍ మెడికల్‍ కమిషన్‍ (ఎన్‍ఎంసీ) లేకుంటే కేసులు నమోదు చేస్తాం.- డాక్టర్‍ వి.నరేశ్ మార్‍, టీజీఎంసీ పబ్లిక్‍ రిలేషన్‍ కమిటీ చైర్మన్‍ 

టెస్టులు చేయకుండానే రిపోర్టులు

ఉమ్మడి జిల్లాలో గల్లీకి మూడు నాలుగు డయాగ్నోస్టిక్‍, స్కానింగ్‍ సెంటర్లు, ల్యాబ్‍లు ఏర్పాటు చేస్తున్నారు.  ఆస్పత్రిలో రూ.1000 అయ్యే టెస్టులను రూ.100, 200 లకు చేస్తామని నమ్మిస్తున్నారు. అమాయక పేషెంట్లు సంప్రదిస్తుం డగా.. బ్లడ్, యూరిన్‍ శాంపిల్ తీసుకుంటున్నారు. ల్యాబ్ లో టెస్ట్ లు చేయకుండానే  పేషెంట్‍ వయసు ఆధారంగా ఏదో ఒక రిపోర్ట్ రాసి ఇస్తున్నారు. ఇది తెలియని బాధితులు రోగాలు తీవ్రమై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 

ఇటీవల వరంగల్ సిటీ సీకేఎం కాలేజీ గ్రౌండ్‍ వద్ద ఒక ఫేక్‍ డయాగ్నోస్టిక్‍ సెంటర్‍ రూ.999కే 25 రకాల మేజర్ టెస్ట్ లు చేస్తామని ప్రచారం చేసింది. తీరా చూస్తే కంపెనీకి సెంటర్ కు మధ్య ఎలాంటి సంబంధంలేదు. ఒక్కో పరీక్షకు రూ.500 నుంచి 800 ఖర్చయ్యేచోట 25 పరీక్షలు చేస్తుండటం తో మెడికల్‍ కౌన్సిల్‍ టీమ్ వెళ్లి గుట్టు బయటకు తీసి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసులు నమోదు చేసింది.