Aviation: దేశంలో కొత్త విమాన సంస్థలు.. ఇండిగో-టాటాలతో పోటీపడతాయా?

Aviation: దేశంలో కొత్త విమాన సంస్థలు.. ఇండిగో-టాటాలతో పోటీపడతాయా?

Shankh Air: భారతదేశంలో విమానయాన రంగం ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రజల ఆదాయాలు పెరగటంతో పాటు వేగవంతమైన ప్రయాణ సౌకర్యాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపటంతో ప్రస్తుతం విమానయాన రంగానికి మంచిరోజులు వచ్చాయి. ఇప్పటికే దీనికి తగినట్లుగా కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా అనేక చోట్ల ఎయిర్ పోర్టులను సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. భవిష్యత్తు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా విమానయాన సంస్థలు కూడా కొత్తగా పుట్టుకొస్తున్నాయి.

గడచిన అనేక దశాబ్థాల భారత విమానయాన చరిత్రను పరిశీలిస్తే కాలగర్భంలో కలిసిపోయిన సంస్థలు ఎన్నో. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అత్యంత లాభదాయకమైన సంస్థగా ఇండిగో కొనసాగుతున్నప్పటికీ.. దీనిని క్రాస్ చేసేందుకు టాటాలకు చెందిన ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా, ఆకాశ వంటి ఇతర సంస్థలు కూడా పోటీపడుతున్నాయి. గత ఏడాది వాడియా గ్రూప్ కి చెందిన గోఫస్ట్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే కొత్తగా మూడు కంపెనీలు తమ ప్రయాణాన్ని భారత గగనతలంలో స్టార్ట్ చేస్తున్నాయి. 

ముందుగా శంఖ్ ఎయిర్ సంస్థ ఉత్తర్ ప్రదేశ్, నోయిడాలోని జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పనిచేయనుంది. ఇదే క్రమంలో దక్షిణాది నుంచి కేరళలో ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ కోసం ఎయిర్ కేరళ, అల్హింద్ ఎయిర్ సేవలను అందించటానికి వస్తున్నాయి. ఇవి ప్రధానంగా గల్ఫ్ దేశాలకు ప్రయాణాన్ని మరింత సులభరం చేయనున్నాయని తెలుస్తోంది. వినానయాన శాఖ సైతం దీనికి అనుగుణంగా నోయిడాలో మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తోంది. శంఖ్ ఎయిర్ లక్నో నుంచి వారణాసి,  గోరఖ్‌పూర్‌లకు.. అలాగే దిల్లీ నుంచి ముంబై, బెంగళూరు సహా ఇతర నగరాలకు సేవలను ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. 

Also Read:-కష్టాల్లో ఇండియన్ మిడిల్‌క్లాస్.. లగ్జరీ జీవితం కోసం వెంపర్లాట..!

అసలు చరిత్రలో ఎన్నడూ చూడని వేగంతో కొత్త కంపెనీల రాకకు కారణం విమాన ప్రయాణానికి భారతీయ ప్రజల నుంచి కొనసాగుతున్న డిమాండ్ అని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రెండు ప్రధాన విమానయాన సంస్థలు దాదాపు 90 శాతం ప్రయాణికులకు సేవలను అందిస్తున్న వేళ ఈ డిమాండ్ మరింత పెరగొచ్చనే అంచనాలు కొత్త సంస్థల రాకకు కారణంగా నిలుస్తోంది.

ఇక కేరళ విషయానికి వస్తే.. ఎయిర్ కేరళ భారతదేశంలో పనిచేస్తున్న మొట్టమొదటి అతి తక్కువ-ధర క్యారియర్‌గా స్థిరపడాలని ప్రయత్నిస్తోంది. కంపెనీ 2025లో తన దేశీయ సేవలను ప్రారంభించి, మరుసటి ఏడాది నుంచి అంతర్జాతీయ రూట్లలో కూడా తన ఆపరేషన్స్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. అలాగే కాలికట్ కేంద్రంగా పనిచేస్తున్న టూర్ ఆపరేటర్ అల్హింద్ గ్రూప్ అల్హింద్ ఎయిర్ ద్వారా ఎయిర్‌లైన్ వ్యాపారంలోకి ప్రవేశించటంతో మరో కొత్త విమానయాన సంస్థ పుట్టుకొస్తోంది.