- పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఎంవీ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ప్రొఫెసర్ శాంతా సిన్హా
వికారాబాద్, వెలుగు : బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం సాధ్యమేనని రంగారెడ్డి జిల్లా ప్రపంచానికి చాటి చెప్పిందని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, ఎంవీ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ప్రొఫెసర్ శాంతా సిన్హా అన్నారు. వికారాబాద్‌లో ఆదివారం ఎంవీ ఫౌండేషన్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఆమె చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. 1996 నుంచి 2023 వరకు ఎంవీ ఫౌండేషన్‌లో చదివిన దాదాపు వెయ్యి మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘పని నుంచి బడికి వచ్చిన మీరంతా అన్ని రంగాల్లో ఉద్యోగాల్లో ఉండడం చూస్తుంటే గర్వంగా ఉంది.
తమ స్ఫూర్తితోనే దేశంలోని రాష్ట్రాలతోపాటు ప్రపంచ దేశాలు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కృషి చేస్తున్నాయి. 30 ఏండ్ల తర్వాత అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూల కోసం పనిచేస్తామన్నారు. ఎంవీఎఫ్ జాతీయ కన్వీనర్ ఆర్. వెంకట్ రెడ్ది మాట్లాడుతూ.. చదువుకుంటే పేదరికాన్ని అధిగమించవచ్చని నిరూపించారని పూర్వ విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.
ఆత్మీయ సమావేశం పండుగల అనిపిస్తుందన్నారు. ఒకప్పుడు బాల కార్మికులుగా ఉన్న వారంతా ఎంవీఎఫ్లో చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. బాల కార్మికులు కనిపిస్తే చదువుకునేలా చేయాలన్నారు. ఎంవీ ఫౌండేషన్ చైర్మన్ విక్రమ్, జాతీయ కన్వీనర్ వెంకట్ రెడ్డి, కో ఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.