ఆనాటి హామీలేవి.. అభివృద్ధి ఏదీ: శాంతిఖని గని ప్రభావిత గ్రామాల ప్రజలు

ఆనాటి హామీలేవి..  అభివృద్ధి ఏదీ: శాంతిఖని గని ప్రభావిత గ్రామాల ప్రజలు
  • ఇయ్యాల ప్రాజెక్ట్ పై రీ వాలిడేషన్ కు పబ్లిక్ హియరింగ్
  • మందమర్రి ఏరియా సింగరేణి అధికారుల ఏర్పాట్లు 
  • 2006లో చెప్పినవే ఇంకా చేయలేదంటున్న స్థానికులు 
  • అభివృద్ధి చేస్తామంటేనే మద్దతు ఇస్తామంటున్న ప్రభావిత గ్రామాలు 

కోల్ బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి టౌన్ శాంతిఖని గని అండర్​గ్రౌండ్​కోల్​మైన్ లాంగ్​వాల్​ప్రాజెక్టు​ఎన్విరాన్​మెంట్​పర్మిషన్​రీ వాలిడేషన్​ కోసం  గురువారం నిర్వహించే పబ్లిక్ హియరింగ్ కు అంతా సిద్ధమైంది. ఇందుకు మందమర్రి ఏరియా సింగరేణి యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. శాంతిఖని గని పాతసైట్​ఆఫీస్​ఆవరణలో ఉదయం11 గంటలకు స్టేట్ పొల్యూషన్​కంట్రోల్ బోర్డు(నిజామాబాద్) ఆధ్వర్యంలో పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తారు. 

అయితే.. 2006లో శాంతిఖని లాంగ్​వాల్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జరిగిన పబ్లిక్​హియరింగ్​లో ప్రభావిత గ్రామాల అభివృద్ధి,  స్థానికులకు ఉపాధి కల్పిస్తామని ఆనాడు సింగరేణి ఆఫీసర్లు హామీ ఇచ్చారు. అన్నేండ్లుగా స్థానిక వనరులు వాడుకుంటూ సంస్థ అభివృద్ధి చెందుతుండగా.. గని ప్రభావిత గ్రామాల అభివృద్ధి, ప్రజలకు కల్పించాల్సిన సదుపాయాల్లో నిర్లక్ష్యం చేశారు. వీటిపై ఏండ్లుగా ప్రభావిత గ్రామాల ప్రజలు పోరాడుతున్నారు.  ఇప్పటికే శాంతిఖని లాంగ్​వాల్​ప్రాజెక్టు వద్దంటూ కొంద రూ జిల్లా కలెక్టర్​కు వినతిపత్రాలు కూడా ఇచ్చారు.  మరోసారి పబ్లిక్​హియరింగ్​నిర్వహిస్తుండగా ఇక్కడ ఆమోదం లభిస్తేనే శాంతిఖని గనిలో బొగ్గు తవ్వకాలు కొనసాగుతాయి.  

2018లో చివరిసారి నిర్వహించగా..

బెల్లంపల్లి మండలం ఆకినపల్లి సమీపంలో 2006 లో శాంతిఖని గని ఏర్పాటైంది.  681.23 హెక్టార్లలో మైనింగ్ తవ్వకాలు చేస్తుండగా రూ.307.84కోట్లతో ప్రస్తుతం గనిని లాంగ్​వాల్ ​ప్రాజెక్టుగా మార్చుతున్నారు. 2018లో చివరిసారిగా సింగరేణి ఎన్విరాన్​మెంట్​పర్మిషన్లు తీసుకుంది. గడువు పూర్తికావడంతో  మళ్లీ తీసుకునేందుకు ప్రజాభిప్రాయ సేకరణ అవసరమైంది. 

బెల్లంపల్లి మండలం ఆకినపల్లి, లింగాపూర్​ తో పాటు  బట్వాన్​పల్లి, పెర్కపల్లి, బుచ్చయ్యపల్లి, పాత బెల్లంపల్లి పంచాయ తీలను శాంతిఖని ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను సేకరిస్తారు. మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్​పర్యవేక్షణలో అన్ని విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. 

ఆనాటి సింగరేణి హామీలను గుర్తు చేస్తూ..

శాంతిఖని లాంగ్​వాల్​ ప్రాజెక్టు నుంచి వృథాగా పోయే నీటిని శంకర చెరువులో నింపుతామని, ప్రభావిత గ్రామాల్లో కమ్యూనిటీ హాల్స్​, లైబరీలు, హెల్త్​సెంటర్ల ఏర్పాటుకు గత పబ్లిక్​హియరింగ్​లోనే హామీ ఇచ్చినా ఆచరణలో చూపలేదు. సీఎస్ఆర్, డీఎంఎఫ్​టీ ఫండ్స్​ద్వారా సౌలతులను కల్పిస్తామని నెరవేర్చలేదు. ఆనాటి ప్రజాప్రతినిధులు కూడా నిర్లక్ష్యం చేశారు. ప్రాజెక్టు కింద సుమారు 650 ఎకరాల వరకు ప్రభావితం అవుతుండగా.. ఆయా గ్రామాల పరిధిలోని చెరువు లు, కుంటలు, బోర్లు ఎండి భూగర్భజలాలు అడుగంటిపోయాయని రైతులు పేర్కొంటున్నారు.  

ప్రధానంగా తాగు, సాగునీటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవంటూ.. లింగాపూర్​– శంకర చెరువు వరకు చెరువుకట్ట రోడ్డుపై ప్రమాదకర పరిస్థితుల మధ్య వెళ్తున్నామంటున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వలస పోతున్నారంటున్నారు. 

సింగరేణి ప్రాజెక్టులైన ఓసీపీలు, గనులు, సోలార్ పవర్​ పాంట్లలో జాబ్ లు కల్పించాలని డిమాండ్​చేస్తున్నారు. వృత్తిశిక్షణ కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని,  ప్రభావిత గ్రామాల్లో సింగరేణి లేదా రాష్ట్ర సర్కార్​ నుంచి పర్మినెంటు డ్రింకింగ్​వాటర్ సప్లై వ్యవస్థను ఏర్పాటు చేయాలని,  గత హామీలతో పాటు కొత్త డిమాండ్లను నెరవేర్చాలని ప్రజలు స్పష్టంచేస్తున్నారు.