ముత్యాలమ్మ గుడిలో అఘోరీ పూజలు

ముత్యాలమ్మ గుడిలో అఘోరీ పూజలు

సికింద్రాబాద్, వెలుగు :  సికింద్రాబాద్​ ముత్యాలమ్మ ఆలయంలో గురువారం స్థానిక మహిళలు శాంతి చండీ హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అమ్మవారి విగ్రహంపై దుండగుడి దాడి తర్వాత స్థానిక భక్తులు రోజూ పలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చివరి రోజైన గురువారం శాంతి చండీ హోమాన్ని నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఓ  మహిళా అఘోరీ నాగసాధు ముత్యాలమ్మ గుడిని సందర్శించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

 గుడి ఎదుట వేసిన టెంటును తొలగించేందుకు ప్రయత్నించడంతో మహిళలు, బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మోండా డివిజన్​కార్పొరేటర్​కొంతం దీపిక మాట్లాడుతూ.. శాంతియుతంగా పూజా కార్యక్రమాలు, అన్నదానం చేపడుతుంటే అడ్డుకోవడం బాధాకరమన్నారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు త్వరలోనే తేదీలు ఖరారు చేస్తామని వెల్లడించారు. ముత్యాలమ్మ గుడిపై దాడికి నిరసనగా ఈ నెల19న సికింద్రాబాద్​బంద్​కు పిలుపునిచ్చినట్లు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బీఎస్ నరసింహ, బజరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు శివరాం వెల్లడించారు.