శరద్‌పవార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ ) నాదేనంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అజిత్ పవార్ సారధ్యంలోని ఎన్‌సీపీనే అసలైన పార్టీగా ఫిబ్రవరి 6 వ తేదీన ఈసీ ప్రకటించింది. అంతేకాకుండా అజిత్ పవార్ వర్గానికే పార్టీ చిహ్నం, గుర్తు కేటాయించింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన శరద్ పవార్ ఫిబ్రవరి 13వ తేదీ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం త్వరలో విచారణ చేపట్టనుంది.
అజిత్ పవార్ వర్గానిదే అసలైన ఎన్పీపీ అని తేల్చిన ఈసీ ఆ మరుసటి రోజు శరద్‌పవార్ వర్గానికి ఎన్సీపీ -శరద్‌పవార్ అనే పేరు కేటాయించింది ఈసీ. కాగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం 1999లో ఎన్‌సీపీ పార్టీని స్థాపించారు శరద్‌పవార్. 1999 లోక్‌సభ ఎన్నికల్లో విడిగా పోటీ చేసినా, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2004లో లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేశారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సారధ్యంలోని యూపీఏ సర్కార్‌లో వ్యవసాయ మంత్రిగా పని చేశారు.
మరోవైపు గతేడాది జులైలో ఎన్సీపీలోని మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్రలోని ఏక్ నాథ్ షిండే సర్కారుకు మద్దతు పలికిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. అజిత్ పవార్ వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలూ మంత్రులయ్యారు. అజిత్ పవార్ వర్గానికి 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. శరద్ పవార్ వర్గానికి 12 మంది ఎమ్మెల్యేలున్నారు.