- శరద్ పవార్‌పై అజిత్ పవార్ విమర్శ
ముంబై:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ తనను ఇమిటేట్ చేయటం చాలా బాధ కలిగించిందని ఎన్సీపీ చీఫ్, రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన అలా చేయడం కరెక్ట్ కాదని తెలిపారు. అజిత్ పవార్ పోటీ చేస్తున్న బారామతి నియోజక వర్గంలో శరద్ పవార్ తన మనవడు యుగేంద్ర పవార్‌ను బరిలోకి దింపారు.
మంగళవారం యుగేంద్ర తరఫున శరద్ పవార్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అజిత్ పవార్ వాయిస్‌ను ఇమిటేట్ చేశారు. ఓటర్ల సానుభూతి కోసం ప్రసంగాల్లో ఏడుస్తూ కర్చీఫ్‌తో కండ్లు తుడుచుకుంటున్నాడని అజిత్‌ను ఎద్దేవా చేశారు.
శరద్ పవార్ చేసిన అనుకరణపై బుధవారం అజిత్ పవార్ స్పందించారు."నేనెప్పుడూ శరద్ పవార్ ను దేవుడిగా భావిస్తాను. కానీ, ఆయన కర్చీఫ్‌తో కండ్లు తుడుచుకుంటూ నా ప్రసంగాన్ని వెక్కిరించారు.
ఈ పని.. బారామతి అభ్యర్థి యుగేంద్ర పవార్ కానీ ఇంకెవరైనా కానీ చేస్తే ఫర్వాలేదు. కానీ శరద్ పవార్ అనుభవజ్ఞుడైన నేత. ఆయన నన్ను అనుకరించిన విధానం చాలా మందికి నచ్చలేదు.
మా అమ్మ పేరు ప్రస్తావనతో నేను భావోద్వేగానికి గురయ్యాను. కన్నీళ్లు పెట్టుకున్నా. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది కూడా. అక్కడ నేను నా కర్చీఫ్ తీయలేదు. కానీ ఆయన అలా వెక్కిరించారు.
శరద్ పవార్ ఇంతకాలం రాజ్ ఠాక్రేను మాత్రమే ఎగతాళి చేస్తారని అనుకున్నా. కానీ మంగళవారం చేసిన ప్రచారంలో శరద్ పవార్ నన్ను ఎగతాళి చేశారు. ఆయన అలా చేయటం నన్ను చాలా బాధ పెట్టింది" అని అజిత్ పవార్ పేర్కొన్నారు.