- కేంద్రానికి ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ విజ్ఞప్తి
సాంగ్లీ(ముంబై): మహారాష్ట్రలో విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచేందుకు రాజ్యాంగ సవరణ తీసుకురావాలని ఎన్సీపీ(ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సాంగ్లీలో శరద్ పవార్ విలేకర్లతో మాట్లాడారు. “రిజర్వేషన్లపై ప్రస్తుతం 50% పరిమితి ఉంది. తమిళనాడులో వివిధ వర్గాలకు 78% రిజర్వేషన్లు ఉన్నాయి. అదేవిధంగా మహారాష్ట్రలో రిజర్వేషన్లు 75% ఎందుకు ఉండకూడదు. కోటాపై పరిమితిని పెంచేందుకు కేంద్రం రాజ్యాంగ సవరణ తెస్తే దానిని మేం స్వాగతిస్తాం” అని శరద్ పవార్ తెలిపారు.
మరాఠాలకు రిజర్వేషన్లు మంజూరు చేసేటప్పుడు ఇతరవర్గాల రిజర్వేషన్లకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మహారాష్ట్రలో సర్కారును మార్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని శరద్ పవార్ పేర్కొన్నారు.