ముంబై: ఎన్సీపీ చీఫ్ పదవికి సీనియర్ నేత శరద్ పవార్ రాజీనామా చేసిన నేపథ్యంలో.. పార్టీని నడిపించేదెవరనేది ఆసక్తికరంగా మారింది. శుక్రవారం జరిగే సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్సీపీ చీఫ్‌ను ఎంపిక చేసేందుకు సంబంధించి శరద్ పవార్ నియమించిన కమిటీ.. ఉదయం 11 గంటలకు ముంబైలోని పార్టీ ఆఫీసులో భేటీ కానుందని తెలిపాయి. పవార్ తన రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గకపోతే.. ఆయన కూతురు సుప్రియా సూలేను పార్టీ చీఫ్‌గా ఎంపిక చేసే అవకాశం ఉందని వివరించాయి.
మరోవైపు తన ఇంటి వద్దకు వచ్చిన మద్దతుదారులతో పవార్ సమావేశమయ్యారు. ‘‘మీరు చెప్పింది నిజమే. అలాంటి నిర్ణయం తీసుకునే ముందు సభ్యులతో చర్చించి ఉండాల్సింది. కానీ మీరు ఎప్పటికీ అంగీకరించరని నాకు తెలుసు. అందుకే నేను నేరుగా ఈ నిర్ణయం తీసుకున్నాను. (పార్టీ చీఫ్ ఎంపికపై) కమిటీ కూర్చుని చర్చిస్తుంది. ఒకటి రెండు రోజుల తర్వాత.. మీరు ఇలాంటి నిరసనలు చేయాల్సిన అవసరం ఉండదు” అని శరద్ పవార్ అన్నారు.