హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలో వచ్చే పూర్ణిమను శరద్ పూర్ణిమ లేదా కామున్ని పున్నమి లేదా కోజాగిరి పూర్ణిమ అంటారు.ఈ ఏడాది అక్టోబర్ 28 వ తేదీన శనివారం నాడు శరద్ పూర్ణిమ వచ్చింది. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున చంద్రుని దగ్గర నుంచి అమృత వర్షం కురుస్తుందని చాలా మంది నమ్ముతారు. సనాతన హిందూ సంప్రదాయంలో పండగలు, పర్వదినాలు జరుపుకునే విధానం ఆయా సీజనల్ కు అనుగుణంగా ఉంటుంది. హిందువుల పండగలు జరుపుకునే నియమాల్లో శాస్త్రీయకోణాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. ఆశ్వయుజ మాసంలోని వచ్చే పూర్ణమిని శరత్ పూర్ణిమ అని అంటారు. అంతేకాదు ఇదే రోజున లక్ష్మీదేవి సాగర మథనం నుంచి ఉద్భవించిందని, అందుకే ఆశ్వయుజ మాసంలో వచ్చే పూర్ణిమ నాడు మహా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే శ్రీ మహా విష్ణువును కూడా పూజిస్తారు.
ఆశ్వయుజమాసం పౌర్ణమి రోజున ( అక్టోబర్ 28) అమ్మవారి ఆరాధనకు విశేషమైన రోజని పండితులు చెబుతున్నారు. అమ్మవారి ఆరాధనను దసరా పండుగ సమయంలో దేవి నవరాత్రులు 9 రోజులు చేస్తారు. అయితే దేవీ ఉపాసకులు మాత్రం దుర్గాదేవిని ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు పూజ చేస్తారు. ఇక పౌర్ణమి రోజు( అక్టోబర్ 28) చంద్రుడిని కూడా విశేషంగా పూజిస్తారు.
ఆశ్వయుజ మాసంలో వచ్చే శరత్ పూర్ణిమకు ( అక్టోబర్ 28) ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని సిద్దాంతులు చెబుతున్నారు. శరత్ పూర్ణిమ నాడు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. శరత్ పూర్ణిమ రోజు (అక్టోబర్ 28) ఇంటిని శుభ్రపరిచేటప్పుడు లక్ష్మీ దేవి మంత్రాలను జపిస్తారు. అలంకరణ , పరిశుభ్రత ఉన్న ఇళ్ళలో ఆ రాత్రి లక్ష్మీ దేవి వస్తుందని నమ్ముతారు. శరత్ పూర్ణిమ రోజున లక్ష్మీ దేవి యొక్క ప్రత్యేక ఆశీర్వాదాలు అందుకుంటారు. ఎందుకంటే కాముని పూర్ణిమ నాడు లక్ష్మి మాత భూమిపైకి వచ్చి ప్రతి ఇంటిని సందర్శిస్తుందని నమ్మకం.
లక్ష్మీదేవికి సోదరుడైన చంద్రుడు శరత్ పూర్ణిమ నాడు మాత్రమే 16 కళలతో ప్రకాశిస్తాడట. అందువలన ఈ రోజు చంద్రుడిని పూజిస్తారు. ఈరోజున చంద్రకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అవి శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయని నమ్మకం. ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి, ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరించాలని పూజారులు చెబుతున్నారు. చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెప్తోంది. వెన్నెలలో పెట్టిన పరమాన్నం చంద్రకిరణాల్లో ఉన్న ఓషిధీతత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుందని.. మర్నాడు ఆ పరమాన్నం కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించడం వలన అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని పెద్దల నమ్మకం.
శరత్ పూర్ణిమ రాత్రి, చంద్రుని వైపు చూస్తే కంటి చూపు మెరుగుపడుతుందని వేద పండితులు చెబుతున్నారు. శరత్ పూర్ణిమ నాడు ( అక్టోబర్ 28) రాత్రి 10 నుండి 12 గంటల మధ్య సమయం చంద్రకాంతి ఉచ్ఛస్థితిలో ఉంటుంది, కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా చంద్రుడిని చూడాలట.శరత్ పూర్ణిమ( అక్టోబర్ 28) నాడు రాత్రి మేల్కొని లక్ష్మీ దేవిని పూజించాలి. ప్రజలు శరత్ పూర్ణిమ రాత్రి కనీసం కొన్ని గంటల పాటు చల్లని చంద్రకాంతిలో కూర్చోవాలి. ఈ రోజున సృష్టించబడిన వాతావరణం ఆస్తమా రోగులకు ప్రత్యేకించి ప్రయోజనకరంగా పరిగణించబడుతుందని పెద్దలు చెబుతున్నారు.