‘కాలం నిరంతరం మారుతూనే ఉంటుంది. గడిచిన యాభై ఏండ్లు ఢిల్లీ రాజకీయాల్లో చోటుచేసుకున్న మార్పులను దగ్గరి నుంచి చూశా. 22 ఏండ్ల పాటు ఇదే ఇంట్లో ఉన్నా, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోయే టైమొచ్చింది. కాలం తెచ్చిన మార్పుల్లో ఇదొకటి’... దేశ రాజధాని ఢిల్లీలోని 7 తుగ్లక్ రోడ్ బంగ్లాను ఖాళీ చేస్తుండగా కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్యాదవ్నోటి వెంట వచ్చిన మాటలివి. కాలంలో మార్పులు సహజమని, కాలంతో పాటే మారాలని తెలిసిన నేత ఆయన. ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ వచ్చిన నేత శరద్‌యాదవ్.
మండల్కమిషన్ సిఫారసుల అమలులో కీలకంగా వ్యవహరించినా, లాలూ ప్రసాద్ సీఎం పీఠమెక్కడానికి వెన్నుదన్నుగా నిలిచినా, ఎమర్జెన్సీని వ్యతిరేకించి జైలుకు వెళ్లాల్సి వచ్చినా, ఓటమి తప్పదని తెలిసీ రాజీవ్‌గాంధీతో ఎన్నికల్లో పోటీపడినా, మార్పును సహజంగా ఆహ్వానించారాయన. అయితే, ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగాలన్న నితీశ్‌కుమార్ నిర్ణయాన్ని మాత్రం మార్పులో భాగమేనని సరిపెట్టుకోలేకపోయారు. జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఫలితంగా మరోమారు ఆయనను రాజ్యసభకు పంపించడానికి నితీశ్ఇష్టపడలేదు. జేడీయూ వ్యవస్థాపకులలో ఒకడిగా, వ్యవస్థాపక అధ్యక్షుడిగా, పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం సేవలందించిన శరద్ యాదవ్.. చివరి రోజుల్లో జేడీయూ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అనివార్యంగా ఆయన పార్టీని వీడారు. లోక్తాంత్రిక్ జనతాదళ్(ఎల్జేడీ) పేరుతో 2017లో కొత్త పార్టీని స్థాపించారు. అయితే, ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. ఇటీవలే ఈ పార్టీని ఆర్జేడీలో విలీనం చేశారు.
తెలంగాణ ఏర్పాటుకు మద్దతు
ఓబీసీలకు రిజర్వేషన్లపై మండల్ కమిషన్ సిఫార్సుల అమలులో కీలకంగా వ్యవహరించిన నేత శరద్ యాదవ్. అప్పటి వీపీ సింగ్సర్కారులో మంత్రిగా పలు శాఖల బాధ్యతలు నిర్వహించారాయన. ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్కల్పించాలన్న మండల్కమిషన్ సూచనలపై అప్పట్లో సర్వత్రా నిరసన వ్యక్తమైంది. మండల్కమిషన్ను నియమించిన కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ కమిషన్రిపోర్టును పక్కనపెట్టింది. వీపీ సింగ్ ప్రభుత్వం ఈ సిఫారసుల అమలుకు అంగీకరించగా, అవి కార్యరూపం దాల్చేందుకు శరద్‌యాదవ్ విశేష కృషి చేశారు. వాజ్‌పేయి ప్రభుత్వంలోనూ ఆయన కేంద్ర మంత్రిగా వ్యవహరించారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు శరద్ యాదవ్ మొదటి నుంచీ మద్దతు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్జిల్లా బాబాయ్ గ్రామంలో నందకిషోర్ యాదవ్, సుమిత్రా యాదవ్ దంపతులకు1947లో శరద్‌యాదవ్ జన్మించారు. చదువులో ముందుండే ఆయన.. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో అప్పట్లోనే గోల్డ్మెడల్సాధించారు. శరద్ యాదవ్.. ఓ ఇంజనీర్, వ్యవసాయవేత్త, విద్యావేత్త కూడా.1989లో రేఖా యాదవ్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.. కూతురు సుభాషిణి, కొడుకు శంతను. వయసు పైబడటంతో అనారోగ్య సమస్యలు ఆయనను చుట్టుముట్టాయి. గురుగ్రామ్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన రాజకీయాల్లో విలక్షణమైన వ్యక్తిగా నిలిచిపోయారు.
27 ఏండ్లకే పార్లమెంట్‌కు వెళ్లి..
పుట్టింది మధ్యప్రదేశ్‌లో అయినప్పటికీ శరద్‌యాదవ్ రాజకీయ జీవితం బీహార్చుట్టే ముడేసుకుంది. విద్యార్థి నాయకుడిగా మొదలైన రాజకీయ ప్రస్థానం ఏకంగా ఏడుసార్లు లోక్‌సభకు, మూడు సార్లు రాజ్యసభకు వెళ్లేంత వరకూ సాగింది. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా1974లో జయప్రకాశ్ నారాయణ్ మొదలుపెట్టిన ఉద్యమంలో శరద్‌యాదవ్ చురుగ్గా వ్యవహరించారు. అదే సమయంలో జబల్ పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రాగా, శరద్‌యాదవ్ ను జయప్రకాశ్ నారాయణ్నిలబెట్టారు. ఆ ఎన్నికలో గెలుపొంది 27 ఏండ్ల వయసులో తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు శరద్‌యాదవ్.
1977లో మళ్లీ అక్కడి నుంచే గెలిచి లోక్‌సభకు వెళ్లారు. 1979లో జనతా పార్టీలో చీలిక ఏర్పడగా ఆయన చరణ్ సింగ్ తో కలిసి నడిచారు. రాజీవ్‌గాంధీ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయగా.. అమేథీలో ఆయనతో శరద్‌యాదవ్ పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో రెండు లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఆయన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అటుపై బాదౌన్ నుంచి పోటీ చేసి ఓడిపోయినా, తర్వాతి ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు.1991లో బీహార్‌లోని మాధేపుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. ఇలా ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఒక దశలో శరద్ యాదవ్ పేరు హవాలా స్కామ్ లోనూ వినిపించింది. అయితే, ఆయనపై వచ్చిన ఆరోపణలను సుప్రీంకోర్టు కొట్టేసింది. - శ్రీధర్ కటకం, సీనియర్ జర్నలిస్ట్