శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఏడుపాయల

శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఏడుపాయల
  • ఆకర్షణీయంగా మండపం తయారు..పట్టు వస్త్రాలు సమర్పించనున్న ఎమ్మెల్యే

పాపన్నపేట, చిలప్ చెడ్, వెలుగు :  శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏడుపాయల ముస్తాబైంది. ఈ నెల 3 నుంచి ఉత్సవాలు మొదలు కానున్నాయి. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలోని గోకుల్ షెడ్ లో దుర్గామాత ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించే మండపాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో తొమ్మిది రోజులు భక్తులకు దర్శనం ఇస్తారు. గురువారం మెదక్​ఎమ్మెల్యే రోహిత్​రావు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేసి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభిస్తారు. 

వైభవంగా జరిగే నవరాత్రి ఉత్సవాలను  తిలకించేందుకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాక హైదరాబాద్​నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజులు నిత్యాన్నదానం ఉంటుందని ఈవో చంద్రశేఖర్​ తెలిపారు. అలాగే ఈనెల 8న పెద్ద ఎత్తున బోనాల ఊరేగింపు ఉంటుందని చెప్పారు. 

చిట్కుల్​లో..

చిలప్ చెడ్ మండలం చిట్కుల్ శివారులో మంజీరా నది తీరాన కొలువైన చాముండేశ్వరి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. దక్షిణ భారతదేశంలో రెండో అతిపెద్ద చాముండేశ్వరీ ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ గుడిలో  చాముండేశ్వరి అమ్మవారు శక్తి స్వరూపిణిగా కొలువై ఉన్నారు. 9 అడుగుల ఎత్తు, 18 చేతులతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. 

Also Read :- హుస్నాబాద్​ను సుందరంగా మారుస్తం

ప్రతి ఏటా దసరా సందర్భంగా ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈనెల 3 నుంచి11వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చాముండేశ్వరి సేవ సమితి సభ్యులు, ఆలయ పూజారి ప్రభాకర్ శర్మ తెలిపారు.

తొమ్మిది రోజులు ఒకే రూపంలో..

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ చాముండేశ్వరి అమ్మవారు తొమ్మిది రోజులపాటు ఒకే అవతారంలో పూజలు అందుకోవడం ఇక్కడి ప్రత్యేకత. గురువారం నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, మహా నివేదన, హారతి, తీర్థ ప్రసాద వితరణ ఉంటాయని చాముండేశ్వరి సేవాసమితి సభ్యులు, ఆలయ పూజారి తెలిపారు. 

ఇక్కడ జరిగే నవరాత్రి ఉత్సవాలను తిలకిచేందుకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి హైదరాబాద్​ నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. సమీపంలోని పవిత్ర మంజీర నదిలో పవిత్ర స్నానాలుచేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ బాధ్యులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.