
- మొదటి రోజు శైల పుత్రిగా దుర్గామాత దర్శనం
పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వన దుర్గామాత సన్నిధిలో శరన్నవరాత్రోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు దంపతులు దుర్గామాతకు పట్టు వస్త్రాలు సమర్పించారు. నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు అమ్మవారు శైల పుత్రిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మెన్ సాతెల్లి బాలాగౌడ్, ఈఓ మోహన్ రెడ్డి, ఆలయ కమిటీ డైరెక్టర్లు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు జగన్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ మెంబర్లు పాల్గొన్నారు.
మెదక్ టౌన్: పట్టణంతో పాటు హవేళీ ఘనపూర్ మండలాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో 26వ వార్షికోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలాగే సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని శ్రీ మహమ్మాయి దేవి ఆలయంలో దుర్గామాత ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.